Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు రేవంత్రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా శాంతిభద్రతల పరిరక్షణలో నిద్రాహారాలు మాని పని చేసే హోంగార్డులకు, మోడల్ స్కూల్స్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ఈమేరకు బుధవారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. హోంగార్డులకు జీతాలు కూడా సకాలంలో ఇవ్వకుండా, విందులు, విలాసాలకు, విదేశీ విహార యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సకాలంలో జీతాలివ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. కట్టు బానిసల కంటే ఘోరమైన స్థితిలో పని చేసే హెెంగార్డుల విషయంలో కనీస కనికరం లేదా? అని నిలదీశారు. జూన్ ముగుస్తున్నా...ఇంత వరకు వారికి మే నెల జీతం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. అదే సమయంలో మెడల్ స్కూళ్లల్లో టీచింగ్-నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు. పేద, మధ్య తరగతికి చెందిన వారికి నెల జీతం రాకపోతే వారుపడే బాధ వర్ణాతీతమని పేర్కొన్నారు. వారి జీవితాలతో చెలగాటమాడుతారా? అని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడమన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.