Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు తరగతులకు ఒక్కరే
- ముంపు గ్రామాల విద్యార్థులకు విద్యా కష్టాలు
- ఇంకా పూర్తికాని పాఠశాలల మరమ్మతు పనులు
- నీటి సమస్య, సిబ్బంది కొరత
నవ తెలంగాణ-గజ్వేల్
''భూములు, ఇండ్లు పాయె.. పిల్లగాళ్ల చదువు కూడా పాడైపాయె.. ప్రాజెక్టు వచ్చి మా జీవితాలను నాశనం చేసింది.. సదువులు సక్కగ లేవు.. వందమందికి ఒక్కరే చెబుతున్నరు.. రెండు వందల మంది ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులున్నరు.. చదువులు సక్కగ సాగేదెట్టా..'' అంటున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాల్టీలోని లింగరాజుపల్లి, సంగాపూర్ సమీపంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు. సంగాపూర్, లింగరాజుపల్లిలోని వందల మంది విద్యార్థులు అన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత నెలకొంది. గతంలో వేములగట్టుతో పాటు ఇతర గ్రామాల్లో పని చేసిన ఉపాధ్యాయులు సిద్దిపేట, దుబ్బాక ప్రాంతానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. దాంతో ముంపు గ్రామాల విద్యార్థులకు 'చదువు శారెడు.. బల్పాలు దోషడు' అన్న చందంగా మారింది. తల్లిదండ్రులు పుస్తకాలు కొనుగోలు చేసి పాఠశాలకు పంపితే అక్కడ చదువు చెప్పే టీచర్లు ఇద్దరే ఉన్నారు. ముంపు గ్రామాల్లోని పాఠశాలలపై నవతెలంగాణ ప్రతినిధి సందర్శించి ప్రత్యేక కథనం.. గజ్వేల్‌లోని పాఠశాలలో ఒక్కో గదిలో వంద మందికిపైగా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒకే టీచర్ బోధిస్తున్నారు. గురువారం టీచర్ అత్యవసరంగా సెలవుపై వెళ్లడంతో ముత్రాజ్పల్లి పాఠశాల నుంచి డిప్యూటేషన్‌పై టీచర్లను ఇక్కడికి పంపారు. ఐదు తరగతులకు ఒకే టీచర్ బోధిస్తున్నారు. ప్రస్తుతం లింగరాజుపల్లి పాఠశాలలో ఐదు తరగతుల్లో 125 మంది విద్యార్థులున్నారు. ఒకే టీచర్ బోధిస్తున్నారు. ఇందులో వందమంది వరకు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల విద్యార్థులున్నారు. సంగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 5 తరగతులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 200 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో 170 మంది విద్యార్థులు మల్లన్నసాగర్ గ్రామాలకు చెందినవారు. ఇక్కడ సైతం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. తరగతి గదులు లేవు. నీటి సమస్య, ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల ఇంకా పూర్తి కాలేదు. ఉపాధ్యాయులు వచ్చే పరిస్థితి కనిపిస్త లేదు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ముంపు గ్రామాల ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారని భావించినా క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా సీఎం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వారం రోజుల్లో పరిష్కారం
వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ప్రస్తుతం గజ్వేల్ మండలంలో 23 మంది ఉపాధ్యాయులు అవసరం. సంగాపూర్, లింగరాజుపల్లి, ఇతర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తాం. ముంపు గ్రామాల విద్యార్థులు ఆర్ అండ్ ఆర్ కాలనీలో నిర్మిస్తున్న పాఠశాలలకు వెళ్తారు. అక్కడ పనులు చివరి దశకు వచ్చాయి.
- సునీత, గజ్వేల్ మండల విద్యాధికారి