Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
- పిల్లలమర్రి, వెలిశాలలో ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు
నవ తెలంగాణ - సూర్యాపేటరూరల్ / తిరుమలగిరి
రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి వెంటనే పట్టాలివ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రిలో సర్వే నెంబర్ 832లో, తిరుమలగిరి మండలం వెలిశాలలోని 146, 147 సర్వేనెంబర్లలోని ప్రభుత్వ భూమిలో పేదలతో కలిసి ఎర్రజెండాలు పాతి ఆక్రమించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. పేదల స్వాధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ బంచరాయి, పోరంబోకు, గ్రామ కంఠం తదితర రకాల ప్రభుత్వ భూములను భూమిలేని నిరుపేదలందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని, వాటిని భూస్వాములు, ధనవంతులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆ భూములను వెలికితీసి పేదలకు పంచాలని, లేనియెడల ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తమ సంఘం ఆధ్వర్యంలో బయటకు తీసి భూమిలేని పేదలకు పంచుతామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే గాదరి కిషోర్ శంకుస్థాపన చేసి ఏడేండ్లవుతున్నా నేటికి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో వ్యకాస జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా కార్యదర్శి మట్టిపెల్లి సైదులు, జిల్లా అధ్యక్షులు వెలిది పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షుడు పులుసు సత్యం, సీఐటీయూ జిల్లా నాయకులు శేఖర్, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.