Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంటులో నిలదీస్తాం
- 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- చంచల్ గూడ జైలులో నిందితులతో రేవంత్ ములాఖత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అగ్నిపథ్‌ను రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో నిందితులుగా ఉన్న నిరసనకారులతో చంచల్ గూడ జైలులో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అగ్నిపథ్ ద్వారా 22 ఏండ్లకే పదవీ విరమణ చేసి ఇంటికి పంపిస్తే ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై పార్లమెంటులో నిలదీస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు యువతకు సంబంధించిన కీలక నిర్ణయాలు వారి భవిష్యత్తును కాపాడేలా తీసుకునేవని గుర్తుచేశారు. అగ్నిపథ్‌పై నిర్ణయం తీసుకునే ముందు పార్లమెంటులో చర్చించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యువతకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకునే ముందు బీజేపీ సర్కారు సమాజంలోని ఏ వర్గంతో కూడా చర్చించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఈ నిర్ణయంతో మోడీ సర్కారు జవాన్లలో గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. రెండేండ్లు తీసుకోవాల్సిన శిక్షణ ఆరు నెలల్లో ఎలా సాధ్యమవుతుందని?ప్రశ్నించారు. అలాంటి శిక్షణతో సమర్థులైన సైనిక అధికారులు వస్తారా? అని అనుమానం వ్యక్తం చేశారు. రిమాండ్‌లో ఉన్న యువకులకు సంబంధించి చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల జాడ తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదుచేశారని తెలిపారు. భవిష్యత్తులో ఉద్యోగాలు రాకుండా వారిపై నాన్ బెయిలబుల్ కేసులునమోదు చేశారు. చాలా మంది రిమాండ్‌లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు తాము ఎలాంటి విధ్వంసాలకు పాల్పడలేదంటూ చెబుతు న్నారని తెలిపారు. అంత మందిపై గుడ్డిగా 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు ఎలా పెట్టారని ప్రశ్నించారు. దేశ యువతకు మోడీ ఇచ్చేనజరానా ఇదేనా? అని ప్రశ్నించారు. రైల్వేపోలీసులు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం ద్వారా 40 రోజుల్లో కేసు దర్యాప్తు ముగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.