Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయరంగం మారుతుందని మంత్రి ఆకాంక్ష
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో కూడిన సదస్సులతో వ్యవసాయ రంగం మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. రైతులు కూడా పంటల వైవిద్దీకరణకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యంతో వరిసాగు అనూహ్యంగా పెరిగిందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ సదస్సుల విజయవంతానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అవసరానికి మించిన వరి సాగు వల్ల కలిగే దుష్పరిణామాలను గమనించి దేశంలోనే తొలిసారి వ్యవసాయ సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. సీజన్‌కు ముందే ఏ పంటలు వేయాలో, రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసర్చ్ అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడంలో భాగంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ విస్తీర్ణం పెంపుదల కొనసాగుతున్నదని గుర్తు చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తిసాగుతోపాటు పప్పు, నూనెగింజలు, కందులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పప్పుశనగ, పొద్దుతిరుగుడు, మినుములు, పెసర్ల సాగును ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 24 వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, గ్రామ, మండలస్థాయి రైతుబంధు సమితుల ప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీచైర్మెన్లతో నిర్వహించిన 17 వ్యవసాయ సద స్సులు విజయవంతమయ్యాయని మంత్రి పేర్కొన్నారు.