Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం
- హెలెన్ కెల్లర్ జయంతి ఉత్సవంలో వక్తలు
- పలువురికి హెలెన్ కెల్లర్ మెమోరియల్ అవార్డుల ప్రదానోత్సవం
- ఆకట్టుకున్న వికలాంగుల సాంస్కతిక ఉత్సవాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హెలెన్ కెల్లర్ పోరాట స్ఫూర్తితో వికలాంగుల హక్కుల కోసం ఉద్యమం నిర్వహించాలని హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల చైర్మెన్ పి ఉమ్మర్ఖాన్ చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వికలాంగుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ), హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆమె జయంతి సందర్భంగా వికలాంగుల సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. హెలెన్ కెల్లర్ మెమోరియల్ ఆవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మర్ఖాన్ మాట్లాడుతూ హెలెన్ కెల్లర్ బదిరుల ఆశాజ్యోతి అని చెప్పారు. వికలాంగుల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని గుర్తుచేశారు. ప్రపంచమంతా తిరిగి వికలాంగుల చైతన్యం కోసం కృషి చేశారని చెప్పారు. మహిళలు, బాలికలు, వికలాంగుల, కార్మికుల సంక్షేమం కోసం ఉపన్యాసాలివ్వటమే గాక, అనేక రచనలు చేశారని తెలిపారు. తమలాగ ఎవరూ కష్టాలు పడకూడదనీ, బదిరుల విద్య అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని చెప్పారు. ఆమె కీర్తిని ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఆమె వారసత్వాన్ని కొనసాగించేందుకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ సమాజం గురించి సకలాంగులు వైకల్యంతో చూస్తున్నారనీ, వికలాంగులు మంచి ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె.వెంకట్, ఎం అడివయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు బదిరుల విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో వికలాంగుల పట్ల చిన్నచూపు కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వికలాంగులను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేయాలన్నారు. వికలాంగులను మానవ వనరులుగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సమాన అవకాశాలు కల్పిస్తే దేన్నయినా సాధిస్తామని అనేక మంది వికలాంగులు నిరూపించారని గుర్తుచేశారు. వారిలో దాగిఉన్న ప్రతిభను వెలికితీయటానికి సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రొఫెసర్ రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ముగచెవిటి వారి కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. వినికిడి నివారణ చర్యలు ముందుగానే చేపట్టాలని ఆయన సూచించారు. టీఏఎస్ఎల్పీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నాగేందర్, ఇమ్మడ్ ఖాన్ మాట్లాడుతూ వినికిడి శక్తిని కోల్పోతున్న వారిని చైతన్యం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అర్ వెంకటేష్, రాజు, సాయమ్మ, నాగలక్ష్మి, మధుబాబు, బలేశ్వర్, దశరథ్, ఉపేందర్, శశికళ, అరిఫా, సాయిరాం, జంగయ్య, యాదయ్య,సత్యనారాయణ, ప్రకాష్, మహమ్మద్, షైన్ బేగంతోపాటు వివిధ జిల్లాల వికలాంగులు పాల్గొన్నారు. ఆమె జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 20 మంది వికలాంగులు, అందులు, బధిరులకు హెలెన్ కెల్లర్ మెమోరియల్ అవార్డులు అందజేశారు.