Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్కు చిన్నారుల లేఖ
- పేద కుటుంబానికి పెద్ద కష్టం
- వైద్యం చేయించలేని దైన్యం
- మెరుగైన వైద్యం అందించాలని సిరిసిల్ల పట్టణం తుక్కారావుపల్లె చిన్నారుల వేడుకోలు
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
కుటుంబం నిత్యం కన్నీళ్ల మధ్య జీవనం సాగించాల్సిన దయనీయమైన పరిస్థితి. ఇంటికి పెద్ద దిక్కు.. అనారోగ్యంతో అచేతనంగా కదలలేని స్థితిలో మంచానికి పరిమితమయ్యాడు.. బీడీలు చుడుతూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకరావడానికి కన్నతల్లి పడుతున్న ఆవేదన.. వైద్యం అందిస్తే కన్నతండ్రి కోలుకుని కుటుంబానికి అండగా నిలుస్తాడన్న ఆశ పసి మనస్సుల్లో మెదులుతోంది. ఆ చిన్నారులు కన్నీళ్లతో మంత్రి కేటీఆర్కు 'నాన్నను బతికించండి సారు' అంటూ లేఖ రాశారు. ఈ క్రమంలో వైద్యం అందించలేని స్థితిలో ఓ నిరుపేద కుటుంబం పడుతున్న ఆవేదనపై నవతెలంగాణ కథనం..రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన మామిండ్ల శ్రీనివాస్ ఉపాధి కోసం సిరిసిల్ల పట్టణానికి వచ్చాడు. తుక్కారావుపల్లెలో అద్దె ఇంట్లో తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారునితో కలిసి ఉంటున్నాడు. శ్రీనివాస్ హమాలీ కార్మికుడిగా పనిచేయగా.. భార్య బీడీలు చుట్టి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. ఇలా ఉన్నంతలో సంతోషంగా సాగుతున్న కుటుంబంలో అనారోగ్యం పిడుగులా వచ్చి పడింది. ఇంటి పెద్దదిక్కు శ్రీనివాస్ అనారోగ్యానికి గురికావడంతో అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం లేకుండాపోయింది. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబం తీరని కష్టాల్లో కూరుకుపోయింది. శ్రీనివాస్ ఇతరుల సహాయం లేనిదే రోజువారి కార్యకలాపాలు చేసుకోలేని స్థితికి చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో భర్త బాగోగులు చూసేందుకు మంజులకు సరిపోతుంది. మరోవైపు ఇంటి అద్దెతోపాటు కుటుంబం గడిచే దారిలేకపోవడంతో నిస్సహాయంగా మిగిలింది. వారి కుమార్తెలు రుచిత, సూచిత ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. కుమారుడు బాబు ఐదోతరగతి చదువుతోన్నాడు. పిల్లలు తండ్రి పరిస్థితిని చూసి అల్లాడిపోతున్నారు. ఓ వైపు కుటుంబం గడవని పరిస్థితులు.. మరోవైపు వైద్యం అందించి నాన్నను బతికించుకునే దారి లేక తల్లడిల్లుతున్న చిన్నారులు.. మా నాన్నను బతికించండి సార్ అంటూ కన్నీళ్లతో మంత్రి కేటీఆర్కు లేఖ రాశారు. తమ కుటుంబం ఉన్న పరిస్థితులను వివరిస్తూ వైద్య సహాయం అందించి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.