Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫస్టియర్‌లో 60.5 శాతం,సెకండియర్‌లో 70.9 శాతం ఉత్తీర్ణత
- ప్రయివేటు కంటే మెరుగైన ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు సత్తాచాటాయి. ప్రయివేటు కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 47.70 శాతం, ప్రభుత్వరంగ కాలేజీలు 73.30 శాతం కలిపి 60.5 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో 66.50 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ద్వితీయ సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 63.56 శాతం, ప్రభుత్వరంగ కాలేజీల్లో 78.25 శాతం కలిపి 70.9 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ప్రయివేటు కాలేజీల్లో 68.30 శాతం ఉత్తీర్ణత వచ్చింది. దీంతో సెకండియర్‌లో ప్రయివేటు కాలేజీల కన్నా ప్రభుత్వ కాలేజీలు 2.6 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో సిలబస్‌ను 70 శాతానికి తగ్గించడం, బేసిక్ లెర్నింగ్ మెటీరియల్‌ను సిద్ధం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవడంతోపాటు వాటిలో నుంచే 80 శాతం వరకు ప్రశ్నలు రావడం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత పెరగడానికి దోహదపడిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. ఇంకోవైపు కరోనా వల్ల విద్యార్థులు రెండేండ్లుగా ఇబ్బందులు పడ్డారని వివరించారు. అందువల్ల అధ్యాపకులు అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారనీ, అర్థమయ్యేలా వివరించారని గుర్తు చేశారు. ఇక ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు వివిధ కోర్సుల్లో ఎక్కువ మార్కులు సాధించడం గమనార్హం.