Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రి సబిత వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను వచ్చేనెల ఒకటో తేదీన విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆమె ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా వచ్చేనెల ఒకటిన విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 12న టెట్ రాతపరీక్ష జరిగిన విషయం తెలిసిందే. టెట్ పేపర్-1కు 3,51,468 మంది దరఖాస్తు చేస్తే 3,18,506 (90.62 శాతం) మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేయగా, 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.