Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 38మంది ఒక రోజు వేతనం కట్
- ఉత్తర్వులు జారీ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్
- గతంలోనే ఇంజినీర్లకు షోకాజు నోటీసులు
- అయినా మారని తీరు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో వర్షాల నేపథ్యంలో రక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన ఇంజినీర్లపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. 38 మంది ఇంజినీర్ల ఒక రోజు వేతనం కట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. అందుకు ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్(నిర్వహణ) అధికారుల నిర్లక్ష్యమేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్ఎన్డీపీ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంజినీర్లకు పురపాలకశాఖ షోకాజు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్(సీసీఏ) రూల్స్ ప్రకారం పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను, ఉన్నతాధికారులకు జవాబుదారీతనంగా లేనందుకుగాను మిమ్ములను ఎందుకు సస్పెండ్ చేయకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో సమావేశంలోనూ మంత్రి కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. అయినా తీరుమారకపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. కమిషనర్ తనిఖీల్లో ఇంజినీర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించడంతో 38మంది ఇంజినీర్లకు సంబంధిచిన ఒక రోజు వేతనంలో కోత విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఆకస్మిక తనిఖీలో..
వర్షాకాలం నేపథ్యంలో నాలాలకు 100శాతం పరిరక్షణ పనులను పూర్తిచేయాలని ఈనెల 5వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం చేస్తే క్రమశిక్షణ చర్యలతోపాటు క్రిమినల్ కేసు కూడా పెడతామని, అవసరమైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. ఇంజినీరింగ్ నిర్వహణ విభాగానికి చెందిన ఎస్ఈ, ఈఈలకు ఆదేశాలు జారీచేశారు. నాలాల్లో పూడికతీత పనులు, పూడికను ఎత్తివేయడం, చైన్‌లింకు మెష్, పూడికతీయడానికి ఏర్పాటు చేసిన దారులను మూసేయాలని సూచించారు. వీటితోపాటు ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని సూచించారు. వీటన్నింటిపై ఈనెల 1వ తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో చర్చించడంతోపాటు 5వ తేదీ వరకు పనులు పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది. అయినా, అధికారులు స్పందించలేదు. ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కమిషనర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఇంజినీర్ల నిర్లక్ష్యం బహిర్గతమైంది. దీంతో కమిషనర్ స్థాయిలో క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్(సీసీఏ) రూల్స్ ప్రకారం షోకాజు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించిన ఇంజినీర్లు ఫొటోగ్రాఫిక్ ఎవిడెన్స్‌తో సమాధానమిచ్చారు. వీటన్నింటిని పరిశీలించి కమిషనర్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగానే 38 మంది ఇంజినీర్లకు సంబంధించిన ఒక రోజు వేతనాన్ని కోత విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.