Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధానిగా పీవీ నరసింహరావు భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా నిలిపారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. పీవీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని పీవీఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ భూ సంస్కరణలను అమల్లోకి తెచ్చి, భూమిలేని పేదలకు భూమి పంచారని చెప్పారు. ప్రపంచ దేశాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందడానికి పీవీ సరళీకృత విధానాలే కారణమన్నారు. ప్రతీ ఒక్కరూ కీర్తించాల్సిన వ్యక్తి అన్నారు. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రధానిగా ఎదిగారనీ, ఆయన సేవలు మరవలేనివన్నారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి పీవీ అడుగుల్లో నడిచారనీ, అదే దారిలో తాము నడుస్తామన్నారు. వంగర గ్రామంలో పీవీ జ్ఞాపకార్దం చేపట్టిన పనులు అసంతప్తికరంగా ఉన్నాయన్నారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. 'వంగివంగి నమస్కారాలేనా? వంగర గ్రామానికి ఏమన్నా చేసేది ఉందా? పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వంగరను అధ్బుతమైన పర్యాటక కేంద్రంగా చేస్తామన్న హమీ ఏమైంది. ఏడాదైనా అతిగతి లేదు' అని ట్వీట్ చేశారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ భూములు పంచితే ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం గుంజుకుంటున్నదన్నారు. నెహ్రూ పరిశ్రమలు తెస్తే మోడీ వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. మోడీ విధానాలకు వ్యతిరేకంగా మరో స్వాతంత్య్రోద్యమం వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి, హర్కర వేణుగోపాల్, అనిల్‌యాదవ్, రోహిన్‌రెడ్డి తదితరులు ఘనంగా నివాళులర్పించారు.