Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఎలక్టివ్ సేవలు నో
- పెండింగ్ వేతనాలు చెల్లించాలి
- డీఎంఈ కార్యాలయం ముందు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించకుంటే ఈ నెల 30 నుంచి అత్యవసర సేవలతో సహా అన్ని రకాల వైద్యసేవలను నిలిపివేయనున్నట్టు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్లోని డీఎంఈ కార్యాలయం ముందు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్ల కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ అనూష, డాక్టర్ కీర్తి స్వరూప్, డాక్టర్ నవీనా, డాక్టర్ నిత్య తదితరులు మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిది నెలల నుంచి సర్కారు వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులపాలయ్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 700 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వాస్పత్రుల్లో సేవలందిస్తున్నారని చెప్పారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ వేతనాల పెండింగ్ సమస్య లేదన్నారు. ఇదే విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనివార్యంగా దశల వారీగా విధులను బహిష్కరించేందుకు నిర్ణయించామని వివరించారు.