Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల రాస్తారోకో
- 24 గంటల కరెంట్ సరఫరా చేయాలి
నవతెలంగాణ-మోర్తాడ్
24 గంటలూ వ్యవసాయ మోటార్లకు కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. అమలులో మాత్రం కనీసం తొమ్మిది గంటలు కూడా సక్రమంగా రావడం లేదని రైతులు వాపోయారు. వర్షాలు సక్రమంగా కురవడం లేదని, దీనికి తోడు కరెంట్ సరఫరా లేక పంటకు నీళ్లు అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ రైతులు మంగళవారం 63వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వర్షాలు లేక సాగుచేసిన పంటలకు నీరు అందించక నానా ఇబ్బందులు పడుతున్నామని, రైతు సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. కరెంట్ సరఫరాలో నిత్యం అంతరాయం నెలకొంటుందని, దీనిపై ట్రాన్స్కో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న ఏఈ అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేయగా.. ఏడీఈ వచ్చి హామీ ఇచ్చే వరకూ అక్కడి నుంచి కదలబోమని రెండుగంటల పాటు భీష్మించుకూర్చున్నారు. అనంతరం అక్కడికి వచ్చిన ఏడీఈ జయరాజ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరెంట్ సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు. అంతటా ఒకే విధంగా 9 గంటల పాటు సరఫరా చేస్తున్నట్టు చెప్పగా.. పక్కనే ఉన్న జగిత్యాల్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో 18 గంటల పాటు కరెంట్ సరఫరా కొనసాగుతోందని, తమకు మాత్రం 9 గంటలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. నీళ్లు అవసరం లేనప్పుడు 20 రోజుల కిందట వరకూ 18 గంటల పాటు సరఫరా చేసి.. తర్వాత నుంచి మాత్రం 9 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారని రైతులు ఆరోపించారు. అయినా మంత్రి, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆవేదన చెందారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద బ్రేకర్స్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.