Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృత్తివిద్యా కోర్సుల ఫీజుల ఖరారు ఆలస్యం
- కాలేజీ యాజమాన్యాల్లో ఆందోళన
- బీఈడీ, లా, బీపీఈడీ ఫీజులు కొలిక్కి
- ప్రభుత్వానికి పంపకుండా ఆగిన ప్రతిపాదనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మెన్ పోస్టు ఖాళీగా ఉన్నది. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌గా పనిచేసిన జస్టిస్ పి స్వరూపరెడ్డి పదవీకాలం ఈనెల 26వ తేదీతో ముగిసింది. దీంతో రాష్ట్రంలో వృత్తివిద్యా కోర్సుల ఫీజుల ఖరారు ఆలస్యమయ్యే అవకాశమున్నది. రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల వరకు ఖరారు చేయాల్సి ఉన్నది. అంటే 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల వరకు ఆ ఫీజులే అమల్లో ఉంటాయి. అయితే కీలకమైన సమయంలో టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పదవీకాలం ముగియడం గమనార్హం. నాలుగు రోజులైనా ప్రభుత్వం దానిపై దృష్టి సారించలేదు. దీంతో కాలేజీ యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే అనుభవం ఉన్న స్వరూప్రెడ్డిని తిరిగి నియమించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే కాలేజీల నుంచి ఫీజుల ఖరారుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించారు. కొన్ని కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు సైతం జరిపారు. ఈ సమయంలో ప్రక్రియ ఆలస్యం కాకుండా ఉండాలంటే పాత వారు అయితేనే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే ఇప్పటికే ఆయన రెండు సార్లు ఆ పదవిలో ఉన్నారు. కాబట్టి కొత్త వారికి అవకాశం కల్పిస్తారన్న చర్చ జరుగుతున్నది. కొత్త చైర్మెన్ వస్తే కాలేజీల ఆదాయ, వ్యయాలు, ఇతర అంశాలను పరిశీలించి సంప్రదింపులు జరిపి ఫీజులు ఖరారు చేసేందుకు సమయం పడుతుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఏదేమైనా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.
11 నెలల తర్వాత రెండోసారి నియామకం
టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌గా జస్టిస్ పి స్వరూప్రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి 2015, జులై 22న నియమించింది. ఆయన 2015, ఆగస్టు 17న బాధ్యతలు స్వీకరించారు. 2018, జులై 21న ఆయన పదవీ కాలం ముగిసింది. అయితే 11 నెలల తర్వాత టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్‌గా స్వరూప్రెడ్డిని ప్రభుత్వం మళ్లీ నియమించింది. అంటే 2019, జూన్ 27న నియమించడం గమనార్హం. దీంతో ఈనెల 26న ఆయన పదవీకాలం ముగిసింది. అందువల్ల టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. ఇప్పుడు ఫీజుల ఖరారు ప్రక్రియ వేగంగా జరగాల్సి ఉన్నది. వచ్చేనెలలో ఎంసెట్ సహా అన్ని సెట్ల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఆగస్టులో ఫలితాలు విడుదలయ్యే అవకాశమున్నది. అంటే ఆగస్టు లేదంటే సెప్టెంబర్‌లో ఇంజినీరింగ్ సహా అన్ని వృత్తి విద్యాకోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సమయం వరకు కాలేజీల ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. అది ఆలస్యమైతే కౌన్సెలింగ్‌పై ప్రభావం పడుతుంది. దాని వల్ల విద్యాసంవత్సరం మరింత ఆలస్యమవుతుంది. విద్యార్థులు నష్టపోయే ప్రమాదముంటుంది.
ఫీజులు ఖరారైనా ప్రభుత్వానికి పంపలేని పరిస్థితి
రాష్ట్రంలో బీఈడీ, లా, బీపీఈడీ కోర్సుల ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసింది. టీఏఎఫ్ఆర్సీ చైర్మెన్ పి స్వరూప్‌రెడ్డి ఉన్నపుడే ఈనెల 24 వరకు ఆయా కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపారు. కాలేజీల వారీగా ఫీజులను ఖరారు చేశారు. ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశారు. కానీ ఈనెల 26న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో ఆ ప్రతిపాదనలపై చైర్మెన్ సంతకం తప్పనిసరిగా కావాలి. దీంతో ఫీజులు ఖరారైనా ప్రభుత్వానికి ఆ ప్రతిపాదనలు పంపించే పరిస్థితి లేదు. బీఈడీ కనీస ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.36 వేలు, లా కనీస ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.36 వేలుగా ఖరారు చేశారు. ఎల్ఎల్ఎం కనీస ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.45 వేలుగా ఉన్నది. బీపీఈడీ కనీస ఫీజు రూ.17 వేలు, గరిష్ట ఫీజు రూ.28 వేలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 230 బీఈడీ కాలేజీలు, 20 లా కాలేజీలు, 13 బీపీఈడీ కాలేజీలున్నాయి. అయితే రెండు బీఈడీ కాలేజీలకు టీఏఎఫ్ఆర్సీ రూ.20 వేల ఫీజును ప్రతిపాదించింది. కానీ ఆ కాలేజీల యాజమాన్యం మాత్రం పీజును తగ్గించాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. దీంతో ఆ పీజును రూ.16,500కు ఖరారు చేసినట్టు సమాచారం.