Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్‌హెచ్‌జీల్లో 46, 66, 523 మంది సభ్యులు
- సెర్ప్ ద్వారా రూ. 56,004 కోట్ల బ్యాంకు రుణాలు
- రాష్ట్ర ప్రభుత్వ నివేదిక వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) మహిళలను సంఘటిత శక్తిగా తయారు చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. మహిళల ప్రభావం విద్య, విజ్ఞానం, రాజకీయం. వ్యాపారం, క్రీడలు తదితర రంగాలన్నింటిలోనూ వేగంగా విస్తరిస్తున్నదని అందులో పేర్కొన్నది. మహిళల సమగ్ర వికాసానికి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నట్టు పొందుపర్చింది. గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని నివేదిక తెలిపింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,36,512 మహిళా స్వయం సహాయక సంఘాలుండగా..వాటిలో 46,66,523 మంది సభ్యులు ఉన్నారు. 32 జిల్లా సమాఖ్యలు, 553 మండల సమాఖ్యలు, 17,954 గ్రామసమాఖ్యలున్నాయి. స్వయం సహాయక సంఘాలు ప్రారంభించిన ఆరు నెలల అనంతరం వారి ఉపాధికి అవసరమైన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్నారు. మహిళలను పొదుపు వైపు మళ్లించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక క్రమ శిక్షణ వైపు మళ్లించడం వంటి కార్యక్రమాలతో మహిళా స్వయం సహాయక సంఘాలు ముందుకెళ్తున్నాయి. రాష్ట్రంలో సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల లోని స్వయం సహాయక సంఘాలకు ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో (2014-15 నుంచి 2021-22 వరకు) 56,004 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించబడిందని నివేదిక తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి గణనీయంగా పెరిగింది.