Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోల్కొండ కోటలో ఘనంగా శ్రీజగదాంబిక అమ్మవారి బోనాలు ప్రారంభం
నవతెలంగాణ-మెహదీపట్నం
గోల్కొండ కోట బోనమెత్తింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్కొండ ఆషాఢమాస భోనాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమ య్యాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. డప్పు చప్పుళ్ల హోరు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల జాతర ప్రారంభోత్సవం సందర్భంగా నగర వాసులేగాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. చారిత్రక కోట గోల్కొండ నుంచి తొలి బోనం బయలుదేరడంతో నెలరోజులపాటు నగరంలో జరిగే బోనాల పండుగకు తొలి అడుగు పడింది. లంగర్‌హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం తొట్టెలకు స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీజగదాంబిక అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువ్రస్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు చేశాం:దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేం దుకు అన్ని ఏర్పాట్లు చేశాం. బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.15 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తున్నాం.
వైభవంగా నిర్వహిస్తున్నాం : మంత్రి మహమూద్ అలీ
గోల్కొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గోల్కొండ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం.
అన్ని శాఖలు సమన్వయంతో.. : మంత్రి తలసాని
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. గోల్కొండ బోనాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. నగరంలోని ప్రతి ఆలయానికీ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు.