Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీ 8 ఏండ్ల పాలనలో అన్నీ అబద్ధాలే
- ఆయనో షావుకార్ల సేల్స్‌మెన్
- దేశాన్ని అమ్మేస్తున్నాడు
- ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారు
- మేం పరిరక్షించుకుంటాం...
- మా ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగానే మోడీ సమాధానాలు చెప్పాలి
- మా ప్రభుత్వాన్ని కూలుస్తారా...సై
- యుద్ధానికి సిద్ధం
- బీజేపీపై సీఎం కేసీఆర్ ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఢిల్లీ పీఠంపై నుంచి ప్రధాని నరేంద్రమోడీని దింపేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తామెక్కడా రాజీ పడబోమనీ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరికంటా పోరాడతామని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమాలు కొత్తేం కాదనీ, సాయుధ రైతాంగ పోరాటం మొదలు, తెలంగాణ ఉద్యమం వరకు గిరి గీసి బరిలో కొట్లాడి విజయాలు సాధించిన చరిత్ర వారికి ఉన్నదని హెచ్చరించారు. ''మహారాష్ట్ర తరహాలో మా ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు.. మీకు దమ్ముంటే రండి. మా ప్రభుత్వాన్ని కూల్చండి... అప్పుడు మేం మరింత స్వేచ్ఛగా మీ కేంద్ర ప్రభుత్వాన్ని మట్టుబెడతాం.. ఖబడ్డార్... మోడీ తానొక బ్రహ్మ అనుకుంటున్నాడు. తానే శాశ్వతం అనుకుం టున్నాడు. అధికారంతో పాటు అహంకారం తలకెక్కితే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఆయన తియ్యటి మాటలు చెప్పారు, ఆ తర్వాత అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రతిష్ట ఘోరంగా దిగజారింది. మోడీ షావుకార్ల సేల్స్‌మెన్. ఆయన ఆయా షావుకార్లకు ఏమేం తినబెడుతున్నడో మా దగ్గర చిట్టా ఉంది.. టైం చూసి బయటపెడతాం. గంగానదిలో అస్తికలు కలుపుతాం. అలాంటిది కరోనా టైంలో లక్షలాది మంది శవాలను పవిత్ర గంగలో కలిపిన చరిత్ర మోడీది. బీజేపీ హాయాంలో ప్రజాస్వామ్యం రోజూ ఖూనీ అవుతుంది. దీన్ని చూస్తే ఊరుకోబోం'' అంటూ బీజేపీ, ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. శనివారం రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. విమానాశ్రయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బహిరంగ సభా స్థలి జలసౌధ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో సీఎం కేసీఆర్ బీజేపీ పాలనను తూర్పారబట్టారు. అసలు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏమేమి అమలు చేశారో ఆదివారం జరిగే ఆపార్టీ బహిరంగ సభలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన గుణగణాలను కొనియాడారు.
''దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులకు ఒక విన్నపం చేస్తున్నాను. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. దీనికి ముందు వీవీ గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటున్న సమయంలో ఆత్మప్రభోదంతో ఓటు వేయండనే నినాదం వినిపించింది. నినాదానికి అనుగుణంగానే వీవీ గిరి విజయం సాధించారు. ఇది మన దేశ చరిత్ర. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులను పోల్చి చూసి మీ ఆత్మప్రభోదానుసారం ఓటు వేయండి. యశ్వంత్ సిన్హా ఈ ఎన్నికల్లో గెలిస్తే దేశ గౌరవం ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను'' అని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని ప్రభుత్వం దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం మౌనంగా ఉండకూడదు. దేశ ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వచ్చారు. రెండ్రోజులు ఇక్కడే ఉంటారు. గొంతు చించుకొని మాకు వ్యతిరేకంగా మాట్లాడనున్నారు. ఎవరికి ఏమనిపిస్తే అది మాట్లాడండి. ఇది ప్రజాస్వామ్యానికి గుర్తింపు. అదే వేదికపై నుంచి మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి'' అని అన్నారు. ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ ''మీరు మొదటిసారి ఎన్నికైనప్పుడు ప్రజలకిచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటైన నెరవేర్చారా. నెరవేరిస్తే ఏ హామీ నెరవేర్చారో చెప్పండి. టార్చిలైట్ పెట్టి వెతికినా ఒక్కటి కూడా దొరకదు. ఇది నేను కాదు. యావత్ దేశం అంటున్నది. మిమ్మల్ని మించిన తెలివైన వారు ఎవరూ లేరని మీరు అనుకుంటారు. అని అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆదాయాన్ని డబుల్ చేస్తానని అన్నారు. డబుల్ ఐతే కాలేదు. ఖర్చు మాత్రం రెండింతలైంది. డీజిల్, పెట్రోల్, విద్యుత్ రేట్లు పెంచారు, ఎరువుల రేట్లు పెంచారు. దీంతో పెట్టుబడి రెండు రెట్లు అయింది. దేశంలోని ప్రతీ రైతుకు ఈ విషయం తెలుసు. మీరు తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు13 నెలలు ఉద్యమం చేపట్టారు. మీరు ఎన్నో దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదులు, ఖలిస్తానీలు అన్నారు. మీ మంత్రులు ఆందోళనకారులపై జీపులు, కార్లు ఎక్కించారు. వారిని చంపారు, హత్యలు చేశారు. ఉద్యమం చేస్తూ 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. మీకు ఈ విషయం పట్ల పట్టింపే లేదు. కనీసం జాలి లేదు. ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు మేం రూ. 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇక్కడి నుంచే ప్రకటించాము. ఈ మధ్యే పంజాబ్ ప్రభుత్వ సహకారంతో చండీగఢ్ దాకా వెళ్ళి రైతుల కుటుంబాలకు ఆ చెక్కులు అందించానని చెప్పారు. దీనిపై కూడా ప్రధానమంత్రి, బీజేపీ నేతలు ఎగతాళిగా మాట్లాడారు. మీరు ఇవ్వరు. ఇచ్చే వాళ్ళను ఎగతాళి చేస్తారు. ఇది మీ విధానం. మీ నీతి. మీరు దేశంలో ఈ రకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు'' అని అన్నారు. ఎన్నికల సమయంలో తీయతీయని మాటలు మాట్లాడటం, ఎన్నికలు ముగిసాక అబద్దపు మాటలు మాట్లాడటం ప్రధానమంత్రి విధానం. దీన్ని దేశం చూస్తోంది. మీరు కరక్టే ఐతే రైతులను ఎందుకు క్షమాపణ కోరారు? మీరు చేసిన రైతు చట్టాలను ఎందుకు ఉపసంహరించుకున్నారు? దాని తర్వాత మీరు రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.'' రైతు తాను పండించిన పంటకు కనీస మద్దతు ధర అడుగుతున్నాడు. ఏ రకంగానైతే మీరు లక్షల కోట్లు పెట్టుబడిదారుల అప్పులు చెల్లిస్తారో అలా కావాలని రైతులు కోరుకోవడం లేదు. రైతులు వారి హక్కులను కోరుకుంటున్నారు'' అని స్పష్టం చేశారు. అది ఇచ్చే సామర్థ్యం కూడా మీ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ''దేశంలో నియంతత్వ పాలన రోజు రోజుకీ పెరుతున్నది. ఈ దేశానికి మోడీ కంటేముందు 14 మంది ప్రధానులు పనిచేశారు. కానీ మోడీ మాత్రం తానే శాశ్వతమని భ్రమిస్తున్నారు. మార్పు అనివార్యం'' అని చెప్పారు. ''దేశంలో నిరుద్యోగ యువత గోస పడుతున్నది. ఉద్యోగాలు భర్తీ చేయరు. పారిశ్రామిక వేత్తలూ గందరగోళంలో ఉన్నారు. ద్రవ్యోల్బణం పెరిగి, ధరలు పెరుగుతున్నాయి. అసలు మీ పాలనా స్వభావం ఏంటి? దీని వల్ల దేశానికి ఏం ఒరిగింది? అన్ని రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం జరిగింది అని విమర్శించారు. ''మీకు వ్యతిరేకంగా మాట్లాడితే సతాయిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు మీరు 9 ప్రభుత్వాలను కూల్చారు. ఇది మీ రికార్డులో ఉంది'' అని ఆక్షేపించారు. శ్రీలంకలో ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై స్పందించండి. ఎందుకు విదేశాలకు వెళ్లి అక్కడ భారతదేశం పరువు తీస్తున్నారు. అమెరికా వెళ్లి ఓపార్టీకి మద్దతుగా మీరు ఓట్లు అభ్యర్థిస్తారా...ఓ దేశ ప్రధానిగా మీరు చేయాల్పిన పనేనా ఇది'' అంటూ నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. 'మేకిన్ ఇండియా' నినాదం పచ్చి అబద్ధం...బూటకం అని విమర్శించారు. అభివృద్ధిలో చైనాను చూసి నేర్చుకోండి అని హితవు పలికారు. రూపాయి విలువ ఎన్నడూ లేని కనిష్టస్థాయికి దిగజారుతుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారు? అని అడిగారు. దేశంలో వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఎందుకు అధికధరకు విదేశీ బొగ్గు కొంటున్నారని ప్రశ్నించారు. దేశంలోని బడా వ్యాపారులకు మోడీ సేల్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సచ్చీలుడే అయితే లేవనెత్తిన అంశాలపై స్పందించాలి అని డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానన్నారనీ, మోడీ హయాంలో అది రెట్టింపు అయ్యిందే తప్ప, ఒక్క రూపాయి వెనక్కి రాలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తూ, పూర్తిగా ప్రయివేటు వ్యాపారుల కొమ్ముకాస్తున్నారు.
మోడీ పాలనలో అనేక రంగాల్లో భారత్ ర్యాంకు అంతర్జాతీయ స్థాయిలో పడిపోయింది. మానవాభివద్ధి సూచికలో భారతదేశం ర్యాంక్ 80 నుండి 131కి పడిపోయింది. మానవ హక్కులలో 85 నుండి 119వ స్థానానికి దిగజారింది. నిరుద్యోగిత రేటు 8.1 శాతానికి పెరిగింది. గత ప్రభుత్వాల హయాంలో ఇది 5.6 శాతంగా ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్, ఎన్విరాన్మెంట్ ఇండెక్స్‌లో దారుణమైన ర్యాంకుకు దిగజారింది. గడచిన 8 ఏండ్ల మోడీ పాలన ఎలాగుందో ఈ గణాంకాలు చెప్తున్నాయని వివరించారు. ''మోడీ నిర్ణయాలు, విధానాల వల్ల అంతర్జాతీయ వేదికలపై భారతదేశం అవమానాలకు గురైంది. పెరుగుతున్న ద్వేషం, విభజన రాజకీయాలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి పెద్ద అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి'' అని చెప్పారు.