Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశనిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తాం
- కేసీఆర్! రాజకీయమంటే సర్కస్కాదు..బాధ్యత :కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో అవినీతి నిర్మూలనకు కృషి చేస్తున్నామనీ, దేశ నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తామని కేంద్రమంత్రి స్మృతి ఇరాని తెలిపారు. ఆదివారం నోవాటెల్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. సమావేశాల్లో అధ్యక్ష ఉపన్యాసం చేసిన ఆ పార్టీ అధ్యక్షులు నడ్డా ప్రసంగాన్ని బ్రీఫ్ చేసి వివరించారు. సమావేశాల్లో దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన యోధులకు, దేశం కోసం ప్రాణాలర్పించిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీకి, బీజేపీ నేతలకు నివాళులు అర్పించినట్టు తెలిపారు. కాశ్మీర్ విషయంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను నిజం చేసిన ప్రధాని మోడీకి నడ్డా కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ నినాదాన్ని సాకారం చేసేందుకు జనదన్యోజన, బీమా, కిసాన్ సమ్మాన్ నిధి వంటి సామాజిక భద్రత, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉన్నతిపై చేపట్టిన పథకాలపై చర్చించారన్నారు. కోవిడ్ సమయంలో ప్రతి బూత్లోనూ బీజేపీ కార్యకర్తలు సేవలందించారన్నారు. దేశ ప్రజలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించామన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన పార్టీ బీజేపీ అనీ, ఒక మహిళకు, ఆదివాసీలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామనడానికి ఇంతకన్నా నిదర్శనమేమి కావాలని అన్నారు. దేశాభివృద్ధి కోసం మోడీ కృషి చేస్తుంటే విపక్ష పార్టీల నేతలు కేంద్రంపై లేనిపోని నిందలు మోపుతున్నారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని స్వాగతం పలికే విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం సరిగాదని అభిప్రాయడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో సర్కస్ చేస్తున్నాడని విమర్శించారు. రాజకీయాలంటే సర్కస్ కాదు..ఒక బాధ్యత అన్నారు. కేసీఆర్ కుటుంబం రాజకీయ అవినీతిలో మునిగితేలుతున్నదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటేలేదన్నారు.