Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాజమాన్యాల కోసమే
- కార్మికుల గోస మీకు పట్టదా కేటీఆర్ ? : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా దేశంలో ఇతర రాష్ట్రాలకన్న భిన్నంగా ఫీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ముందు వరుసలో ఉన్నామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కితాబు ఇచ్చుకోవడాన్ని సీఐటీయూ తప్పుబట్టింది. ఈ విధానం యాజమాన్యాలకు మరిన్ని లాభాలు తెచ్చి పెడుతుందే తప్ప కార్మికులకు ఒరిగేదేమీ లేదని తెలిపింది. సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలు కాదు..చెమట చుక్కలను ధారబోసి ఉత్పత్తులు తయారు చేసే కార్మికులేనన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తించాలని సూచించింది. కార్మికుల గోస మీకు పట్టదా? అని ప్రశ్నించింది. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ''టీఎస్ఐపాస్ చట్టం ద్వారా 15 రోజుల్లో పరివ్రమలకు డీమ్డ్టూబి అప్రూవల్ విధానాన్ని అమలు చేస్తున్నాం. సెల్ఫ్ సర్టిపికెల్ విధానం సైతం దేశంలో ఎక్కడా లేదు. పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతవరణాన్ని సృష్టిస్తున్నాం. రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో పరిశ్రమలు ప్రశాంతంగా నడుస్తున్నాయి. ఒక్క పరిశ్రమ కూడా లాకౌట్ పడలేదు. పారిశ్రామిక వేత్తలు సంపద సృష్టికర్తలు'' అని ఫె˜డరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండిస్టీ (ఎఫ్,టి,సి.సి.ఐ) సదస్సులో రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే కార్మికులు, ఉద్యోగుల ప్రస్తావన లేకుండా కేటీఆర్ ప్రసంగం సాగటం బాధాకరమని పేర్కొన్నారు. కార్మిక హక్కులను విస్మరించి టీఆర్ఎస్ సర్కారు తన పెట్టుబడిదారీ వర్గ స్వబావాన్ని చాటుకున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కార్మిక శాఖ నిర్వీర్యమైపోయిందనీ, అది యజమానుల శాఖగా మారిందని తెలిపారు. యాజమాన్యాలకు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే వెసులుబాటు కల్పించడంతో కార్మిక చట్టాల అమలు చేయని సంస్థల యాజమానులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాల జీవోలను సవరించకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలలో కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు కావట్లేదనీ, లేబర్ కోడ్లు అమల్లోకి రాకుండానే పారిశ్రమిక ప్రాంతాల్లో 12 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు. కాటేదాన్, భువనగిరి, చర్లపల్లి, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో, మహబూబ్నగర్ జిల్లాల్లో సోలార్ పరిశ్రమలో కార్మికులపై యాజమాన్యాలు వేధింపులకు దిగుతున్నారనీ, న్యాయం చేయాల్సిన కార్మిక శాఖ అధికారులు మొద్దునిద్రపోతున్నారని విమర్శించారు.