Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీగల ఘాటు వ్యాఖ్యలు
నవతెలంగాణ - మీర్పేట్
అభివృద్ధి పేరుతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెరువులను నాశనం చేస్తు న్నారని, ఇలాగైతే ఊరు కునేది లేదని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మీర్పేట్ కార్పొరేషన్ పరి ధిలో మంత్రాల చెరువు పక్కన వీధి వ్యాపారుల కోసం నిర్మించబోతున్న షాపింగ్ షెడ్ల స్థలాన్ని మంగళవారం తీగల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి ఆ స్థలం డీసీఎంలు నిలిపే అడ్డాగా కొనసాగుతోందని, అలాగే కొనసాగించాలని అన్నారు. భారీ వర్షాలు వస్తే చెరువు నిండిపోయే ప్రమాదం ఉందని, అలాంటి స్థలంలో వీధివ్యాపారులకు రూ.50 లక్షలతో షెడ్ల నిర్మాణం చేపట్టడం తగదని చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చెరువుల చుట్టూ ట్రంక్ లైను నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన రూ.23 కోట్లు ఇప్పటికే దుర్వినియోగం అయ్యాయన్నారు. ట్రంక్లైన్ పనులు పూర్తికాకపోవడంతో నిర్మాణం అసంపూర్తిగా ఉందన్నారు. డీసీఎం అడ్డాను తొలగించడం సరైంది కాదన్నారు. దానివల్ల వాహన యజమానులు, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్పారు. సందె చెరువు విస్తీర్ణం తగ్గేలా సుందరీకరణ పనులు చేపట్టడం వల్ల చెరువు కుచించుకుపోయిందన్నారు. మంత్రి సబితారెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు మీరుపేటకు చేటు తెస్తున్నాయని విమర్శించారు. తన సొంత గ్రామాన్ని కాపాడుకోవడానికి, మూడు చెరువులను రక్షించుకోవడానికి అవసరమైతే ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. ఊరి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయనని, అవసరమైతే నిరాహారదీక్ష చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పలు కాలనీల ప్రజలు, డీసీఎం అడ్డా నాయకులు పాల్గొన్నారు.