Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ స్పష్టత : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకుల చేరికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. స్థానిక పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు పోతున్నట్టు తెలిపారు. చేరికల వివరాలు బయటకు వస్తే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఒత్తిడి చేసి వారిని నిలువరించే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద ఎత్తున జరగబోయే చేరికలపై అధిష్టానం నుంచి స్పష్టత తీసుకున్నట్టు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ, టీఆర్ఎస్ లోపాయకారి వ్యవహారాలు, పార్టీలో చేరికలు, రాహుల్‌గాంధీ పర్యటనలు, విద్యార్థి, నిరుద్యోగ డిక్లరేషన్, దళిత, గిరిజన డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ టికెట్ల అంశాన్ని ఎన్నికలు వచ్చినప్పుడు ఒక ప్రక్రియ ద్వారా జరుగుతుందనీ, గెలుపు ఒకటే కాకుండా కాంగ్రెస్ పట్ల ఉన్న నిబద్ధత విశ్వసనీయత కూడా టికెట్ల కేటాయింపులో పరిగణనలో తీసుకోనున్నట్టు చెప్పారు. పార్టీ విధానం ప్రక్రియ ప్రకారమే టికెట్లు ఇస్తామన్నారు. కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ అన్న ఇప్పుడు భారత పార్టీ అన్న కేవలం మోడీకి బీజేపీకి ఉపయోగపడటం కోసమేనని విమర్శించారు. మోడీకి అనుకూలంగా ప్రతిపక్షాలను చీల్చే ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రయత్నాలు రాష్ట్రపతి ఎన్నికల్లో విషయంపై మమతా బెనర్జీ విపక్షాల సమావేశం నిర్వహించిన రోజు టీఆర్ఎస్ హాజరు కాలేదని గుర్తు చేశారు. ఆరోజు బీజేపీ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితి ఉన్నదన్నారు. నవీన్ పట్నాయక్, ఇతర పార్టీల నేతల మద్దతు ప్రకటించిన బీజేపీ అభ్యర్థి గెలుస్తారని స్పష్టత వచ్చాక టీిఆర్‌ఎస్ విపక్షాల అభ్యర్థికి మద్దతు ప్రకటించిందని విమర్శించారు. మమతాబెనర్జీ సమావేశానికి హాజరుకాకుండా విపక్షాల అభ్యర్థి నామినేషన్‌కి హాజరు కావడంలోనే టీఆర్ఎస్ వ్యూహం, మోడీ అనుకూల విధానం స్పష్టమవుతు న్నదన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ని ముందుకు తీసుకుపోతారని తెలిపారు. పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి ప్రతిపక్షాల ఓట్లన్నిటినీ తనవైపుకి లాక్కోవడానికి చేసినట్టుగానే తెలంగాణలోనూ బీజేపీ, టీఆర్ఎస్ కోసం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్లో ఏ రకంగా మమతా బెనర్జీకి, బీజేపీకి ఉపయోగపడే వ్యూహాన్ని అమలు చేశారో తెలంగాణలోనూ అదే వ్యూహం అమలు చేస్తున్నారని విమర్శించారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెప్పారు. చేరికల జాబితాపై అధిష్టానంతో చర్చించినట్టు తెలిపారు. పార్టీలో భిన్నాభిప్రాయాలను భేదాభిప్రాయాలుగా చూడటం సరైందికాదన్నారు.
ధరణితో వేలాది రైతులకు అన్యాయం : మధుయాష్కీగౌడ్
ధరణిపోర్టల్తో వేలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మదన్మోహన్రావు, ఎమ్మెల్యే రాములు నాయక్, బెల్లయ్య నాయక్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసైన్డ్ భూములను పేదలకు పంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బహుజన వర్గాల దగ్గర అసైన్డ్ భూములను లాక్కుంటున్నదని విమర్శించారు. ఈనేపథ్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ధరణి సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.