Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేహెచ్ఎస్ సమస్య పరిష్కారానికి మంత్రి హరీశ్ రావు హామీ
- హెచ్‌యూజే ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రయివేటు ఆస్పత్రుల్లో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సేవలు అందేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హెచ్‌యూజే (టీడబ్ల్యుజేఎఫ్) అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్, నిరంజన్ కొప్పు ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం మంగళవారం మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టు హెల్త్ స్కీమ్(జేహెచ్ఎస్) ప్రయివేటు ఆస్పత్రుల్లో అమలు కావడంలేదని, వైద్యం చేయడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయని తెలిపారు. జర్న లిస్టులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అందుకే సమస్యను మంత్రి దృష్టికి తీసు కళ్లామన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి.. నెట్వర్క్ ఆస్పత్రులతో త్వరలో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైద్య రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్‌యూజే ఉపాధ్యక్షులు పద్మరాజు, రాజశేఖర్, నాయకులు అరుణ్ తదితరులు ఉన్నారు.