Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల్లో అవగాహన, పరీక్షలు చేయడం, చికిత్స అందించడం
- పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలి: మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీజనల్ వ్యాధులపై మూడంచెల వ్యూహంతో ముందుకెళ్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్లో, రాష్ట్రంలోని నాలుగు ఐటిడిఏల పరిధిలోని 11 జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీజనల్ వ్యాధులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన, పరీక్షలు చేయడం, చికిత్స అందించడం వ్యూహంగా అమలు చేస్తున్నామన్నారు. కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉంటున్నందున, పరీక్షలు విస్తతంగా నిర్వహించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఈ విషయంలో పంచాయతీ రాజ్ సహా ఇతర శాఖలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బందంతో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఒక్కసారిగా వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అప్రమత్తం చేశారు.
రాష్ట్రావిర్బావానికి ముందు సీజనల్ వ్యాధులంటే అల్లాడిపోయే వారమనీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని తెలిపారు. మలేరియా నియంత్రణలో కేటగిరీ 2 నుండి కేటగిరీ 1కి చేరినట్టు తెలిపారు. ఒకటి, రెండు కేసులు నమోదు కాగానే అవసరం ఉన్న చోట ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయాలి. సత్వర చికిత్స అందించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని మంత్రి కోరారు. ఏటూరు నాగారం, ఉట్నూర్ , భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ఐటిడిఏల పరిధిలోని జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసుకోవడం, సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం వంటివి చేయాలన్నారు.
108 వాహనాలు వెళ్ళలేని ప్రాంతాలు ముందే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలి. వాగులు పొంగటం, రోడ్లు చెడి పోవడం వల్ల కొన్ని గిరిజన ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ పోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వ్యాధుల పడ్డ రోగులతో పాటు గర్భిణుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. బర్త్ వెయిటింగ్ రూంలను సద్వినియోగ పరుచు కోవాలి. దోమకాటుకు గురి కాకుండా విస్తృతంగా దోమ తెరల పంపిణీ చేయాలి. దోమలు నివారించ డానికి ఫాగింగ్, నీటి నిల్వ లేకుండా చూడటం వంటివి చేయాలి. పంచాయతీరాజ్ శాఖ మరియు వైద్యశాఖలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.