Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో ఆర్టీసీని కోరతాం
- ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు పెంచండి: డీఐఈవోలకు ఇంటర్ విద్యా కమిషనర్ జలీల్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను అందించాలంటూ జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహకారంతో ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరతామని ఇంటర్ విద్యా కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరాలని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక కృషి చేయాలని డీఐఈవో, నోడల్ అధికారులు, ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ ప్రవేశాల కోసం ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్యతోపాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మెరుగైన వసతులు, ఉచిత ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నామంటూ బ్రోచర్లు, కరపత్రాలు, బ్యానర్ల దారా విస్తృతంగా ప్రచారం చేపూట్టాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. నగరాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాల ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, ప్రజలు గుమిగూడే ప్రదేశాల్లో బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించాలని వివరించారు. క్రీడలు, ల్యాబ్‌లు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిజిటల్ తరగతి గదులున్నాయని వివరించారు. ఇంటర్లో వచ్చిన ఫలితాలను ప్రచారం చేయాలని కోరారు. ప్రిన్సిపాళ్లతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది ప్రవేశాలను పెంచేందుకు భాగస్వాములను కావాలని ఆదేశించారు. ఆన్లైన్ ప్రవేశాల కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల వివరాలను కలెక్టర్ల సహకారంతో పొందాలనీ, వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరాలంటూ సమాచారం అందించాలని సూచించారు. ఆర్జేడీలు, డీఐఈవోలు, నోడల్ అధికారులు, ప్రిన్సిపాళ్లు ఈ కాలేజీల్లో ప్రవేశాలు పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.