Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో అగ్రగామిగా తెలంగాణ
- ప్రాథమిక పాఠశాలలకు 15,169 అంగన్వాడీ కేంద్రాల అనుసంధానం
- 4.72 లక్షల గర్భిణీలు, బాలింతలకు, 17.63 లక్షల మంది పిల్లలకు పోషకాహారం
- హెల్ప్‌లైన్ సెంబర్ 155209 ఏర్పాటు
- వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంగన్ వాడి కేంద్రాల ద్వారా 17.63 లక్షల మంది పిల్లలకు, 4.72 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందిస్తున్నామని తెలిపింది. రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలలో 15,169 కేంద్రాలను ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలతో అనుసంధానం చేసినట్టు వెల్లడించింది. అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వేతనాలను చెల్లిస్తున్నదని తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలపై ఫిర్యాదులు చేసేందుకుగానూ హెల్ప్ లైన్ నెంబర్ 155209ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి పనితీరు పర్యవేక్షణ కోసం 149 ఐసీడీసీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమావళికి అనుగుణంగా గర్భిణీ మహిళలకు బాలింతలకు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు ప్రతి రోజు ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వం రూ.24.77 ఖర్చు చేస్తున్నది. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేస్తున్నది. తీవ్ర పోషకాహార లోపంతో ఉన్న పిల్లల, ఆరోగ్య సంరక్షణకు బాలామృతం కార్యక్రమం ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నది. తెలంగాణ ఫుడ్స్ ద్వారా బాలామృతాన్ని అందిస్తున్నది. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న పిల్లలను తరలించి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టేందుకు జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో 2022 నాటికి మాతృ మరణాల రేటు జాతీయ సగటు 103 కాగా రాష్ట్రానికొచ్చేసరికి అది 56గా నమోదైంది. శిశు మరణాల రేటు దేశ సగటు కంటే 32 ఉంటే తెలంగాణలో కేవలం 23 మాత్రమే. తెలంగాణలో 97 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దేశ సగటు 79 శాతమే. ప్రభుత్వాస్పత్రుల్లో 2014లో ప్రసవాల రేటు 30 శాతం కాగా 2022కి వచ్చేసరికి అది 56 శాతానికి పెరిగింది. మూడేండ్ల నుంచి ఆరేండ్ల వయస్సు గల పిల్లలకు డిజిటల్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌ను అందించేందుకుగానూ టీశాట్ ద్వారా ఒక గంట పాటు ప్రత్యేక విద్యాకార్యక్రమాలను ప్రభుత్వం ప్రసారం చేస్తున్నది. అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలను రాష్ట్రప్రభుత్వం పెంచింది. టీచర్‌కు రూ.13,650, మినీ అంగన్ వాడీ టీచర్, హెల్పర్లకు కు రూ. 7800లను ప్రతినెల గౌరవవేతనంగా చెల్లిస్తున్నది. అంగన్ వాడి కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా ఉంది. చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా అంగన్ వాడి టీచర్లు, హెల్పర్స్ పోచంపల్లి చేనేత చీరలను ప్రభుత్వం అందించింది.