Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయకులు, టీచర్లను అరెస్టు చేసిన పోలీసులు
- బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి
- ఎస్టీయూ అధ్యక్షులు సదానందంగౌడ్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు (డీఎస్ఈ) కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఉపాధ్యాయులు, జాక్టో నాయకులు యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో తోపులాట, వాగ్వివాదం జరిగింది. రోడ్డుపైనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో దొరికిన వారిని దొరికినట్టుగానే అరెస్టు చేసి హైదరాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. జాక్టో నేతలు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి, పి చంద్రశేఖర్, ఎం రాధాకృష్ణ, కె కృష్ణుడు, ఎ లక్ష్మణ్‌గౌడ్, బి భుజంగరావు, కె గౌరీశంకర్, జి హేమచంద్రుడు, సచ్చిదానందరెడ్డి, జయబాబు, డివి రావు, కె వెంకట్, దానయ్య, ఎస్ విఠల్, బి సత్యనారాయణ, శర్మ, కె చైతన్య, ఎం గంగరాజుతోపాటు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా వారిని పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. దీంతో జాక్టో నేతలు అక్కడ సైతం నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు మీడియాతో జి సదానందంగౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కరించాలంటూ శాంతియుతంగా ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. సీఎం, విద్యామంత్రి ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు ఇస్తామన్నా, విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంకా ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. పీఈటీ, పండిత పోస్టుల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు (పీఎస్‌హెచ్‌ఎం) మంజూరు చేయలేదని విమర్శించారు. పర్యవేక్షణ అధికారులైన డిప్యూటీఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్ల పోస్టులకు పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదన్నారు. 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల అప్పీళ్లు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం టీఆర్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని కోరారు. విద్యార్థులకు నష్టం లేకుండా విద్యావాలంటీర్లను వెంటనే నియమించాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు సర్వీసు పర్సన్లను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని హెచ్చరించారు.