Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్లు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
- యూఎస్పీసీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలనీ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సమావేశం చావ రవి అధ్యక్షతన మంగళవారం వర్చువల్గా నిర్వహించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, సయ్యద్ షౌకత్ అలీ, యు పోచయ్య, డి సైదులు, కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి, ఎస్ హరికృష్ణ, వి శ్రీనివాస్ నాయక్, బి కొండయ్య, జాడి రాజన్న, మేడి చరణ్ దాస్, వై విజయకుమార్, టి విజయసాగర్, మసూద్ అహ్మద్, ఎ గంగాధర్, శాగ కైలాసం, చింతా రమేష్, బిక్షపతి, రాజయ్య, మహేష్ పాల్గొన్నారు. అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. 317 జీవో కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను, పారిశుధ్య నిర్వహణ కార్మికులను నియమించాలని కోరారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకుంటే ఈనెల ఏడున మహాధర్నా చేపడతామంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గత నెల 20న అల్టిమేటం ఇచ్చామని వివరించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆ మరుసటి రోజే షెడ్యూల్ విడుదల చేస్తున్నామంటూ విద్యామంత్రి, విద్యాశాఖ కార్యదర్శి హడావుడి చేసి మళ్లీ మరిచిపోయారనీ, రెండు వారాలుగా షెడ్యూల్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు. కనీసం షెడ్యూల్ విడుదలకు గల ఆటంకాలేమిటో స్పష్టం చేయకుండా విద్యాశాఖ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.