Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరారీలో నలుగురు
- 8.30 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
నవతెలంగాణ-హయత్‌నగర్
సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మూఢనమ్మకాల మాయలో పడి ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు. ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకొని ఫేక్ బాబాలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి ఏడుగురు దొంగబాబాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరోవైపు పలు యూనివర్శిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి సొమ్ము చేసుకుంటున్న ముఠాను కూడా పట్టుకున్నారు. వీటికి సంబంధించి మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేశ్ మురళీధర్ భగవత్ వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ సిరోహి ప్రాంతానికి చెందిన రామనాథ్(40), జొన్నత్(33), గోవింద్‌నాథ్ (28), అర్జున్‌నాథ్ (22), పునరం (37), వసనారాం (22), ప్రకాశ్ జోటా (27) నకిలీ బాబాల పేరుతో చలామణి అవుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వారికి పూజలు చేసి, దోషాలను తొలగించి నయం చేస్తామని ప్రచారం చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు. భువనగిరికి చెందిన కొండల్‌రెడ్డి ట్రాన్స్‌ఫోర్ట్ వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది రోజుల కిందట ఇతను బైక్ మీద నుంచి పడ్డాడు. ఇలా అనేక సార్లు ప్రమాదాలు జరగడంతో తెలిసిన వ్యక్తుల ద్వారా నకిలీ బాబాలను ఆశ్రయించాడు. దీంతో కొండల్‌రెడ్డికి స్పర్ప దోషం ఉందని, పూజలు చేయకపోతే ప్రాణం పోతుందని నమ్మించారు. పూజలు, హోమాల పేరుతో కొండల్‌రెడ్డి నుంచి రూ.37 లక్షల 71 వేలు వసూలు చేశారు. చివరకు తాను దొంగ బాబాల చేతిలో మోస పోయానని తెలుసుకున్న కొండల్‌రెడ్డి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది. భువనగిరి ఎస్ఓటీ, భువనగిరి టౌన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌తో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి నుంచి రూ. 8.30 లక్షలు, 12 సెల్ఫోన్లు, కౌంటింగ్ మిషన్, రుద్రాక్ష మాలలు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోనే కాకుండా ఈ ముఠా ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా ప్రజలను మోసం చేసినట్టు విచారణలో వెలుగుజూసింది. మీడియా సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ, భువనగిరి పోలీసులు పాల్గొన్నారు.
ఫేక్ సర్టిఫికెట్ తయారీ ముఠా అరెస్ట్..
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేపట్టగా నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. ఈ కేసులో ప్రధాన సూత్రదారి వడ్డె రోహిత్‌కుమార్(27), వడ్లమూరి శ్రీనివాసరావు(25), సిరిసాల లక్ష్మి(30), గారెపల్లి సాయి ప్రణరు(25)ను అరెస్టు చేశారు. కాకతీయవర్సిటీ, జేఎన్టీయూ, ఆచార్య నాగార్జునవర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు శ్రీలక్ష్మీ కన్సల్టెంట్స్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌ను రూ. 30 వేల నుంచి రూ.40 వేల వరకు విక్రయిస్తున్నారు. విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 20 దాకా నకిలీ సర్టిఫికెట్స్ విక్రయించినట్టు తెలిసింది. ఆరు నెలల నుంచి ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా చేస్తున్నారు. నిందితుల వద్ద 106 నకిలీ సర్టిఫికెట్స్, 2 ల్యాప్టాప్స్, ఒక ప్రింటర్, 4మొబైల్ ఫోన్లు, రెండు ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 30 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రెస్మీట్లో డీసీపీ నారాయణ రెడ్డి, ఎస్ఓటీ డీసీపీ, ఏసీపీ వెంకన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.