Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియంత్రణ కమిషన్ కోసం ఈ నెల 15న రాష్ట్ర సదస్సు : పట్నం కార్యదర్శి డీ జీ నర్సింహరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రయివేటు విద్యా సంస్థల్లో ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారని తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక(పట్నం) కార్యదర్శి డీజీ నర్సింహరావు ఆందోళన వ్యక్తం చేశారు.ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని దొడ్డికొమురయ్య హాల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కోట రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీ నర్సింహరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య అందకుండా పోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా విద్యా సంస్థలు తమకు ఇష్టమొచ్చినట్టుగా ఫీజులు పెంచుతున్నారని చెప్పారు. ఎల్కేజీ విద్యలో కూడా వేల రూపాయల ఫీజు కట్టాల్సి వస్తున్నదని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారని తెలిపారు. ఆ పై చదువులకు ఇంకెన్ని లక్షలు చెల్లించాల్సి వస్తున్నదో అర్థం చేసుకోవాలన్నారు. ఫీజుల చెల్లింపుకు శాస్త్రీయత లేదని తెలిపారు. విద్యా హక్కు చట్టాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదని చెప్పారు. ఫీజులను అదుపు చేసేందుకు ప్రభుత్వం చట్టాలు తీసుకురావటమే గానీ..వాటి అమలుపై ఉదాసీనంగా ఉంటుందని విమర్శించారు. ఫీజుల నియంత్రణ కోసం 2016లో వేసిన ప్రొఫె˜సర్ తిరుపతిరావు కమిటీ ఫీజులను తగ్గించాలని సిఫారసు చేయకపోగా..ప్రతి ఏడాది 10నుంచి 30శాతం పెంచుకోవచ్చని చెప్పిందని గుర్తుచేశారు. ఈ ఏడాదిలో వాటిని నియంత్రిస్తామని ప్రగల్బాలు పలికిన సర్కారు..ఆచరణలో ఏ మాత్రం శ్రద్ధ వహించటం లేదని చెప్పారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 15న ప్రజాసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు.
కేరళ మోడల్ విద్యను అందించాలి..
కేరళ మోడల్లో విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలనీ, తిరుపతి రావు కమిటి సిఫారసులను తక్షణమే బహిర్గతం చేయాలని నాగరాజు డిమాండ్ చేశారు.కార్పొరేట్ ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల దందా నడుస్తున్నదని చెప్పారు.ఈ ఏడాది 40శాతం ఫీజులు పెంచారని తెలిపారు. ఫ్రొఫెషనల్ కోర్సుల ఫీజులకు నియంత్రణ ఉన్నట్టు మిగతా వాటికి కూడా నియంత్రణ సంస్థ ఉండాలని డిమాండ్ చేశారు. మరో పక్క ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనీ, ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి..
రాష్ట్రంలో తక్షణం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి విద్యావ్యవస్థ బలోపేతం పట్ల ప్రభుత్వ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని వెంకటేశ్ డిమాండ్ చేశారు.జీవోలిచ్చి వాటిని నిర్వీర్యం చేయటం తగదని హితవు పలికారు.