Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలి
- అవసరానికి మించి డెంటల్ డాక్టర్ల నియామకం
- స్పెషలిస్టు డాక్టర్లేమో లేరు..
- ల్యాబ్‌లను అక్కడే పెట్టాలి : సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్
నవతెంగాణ-సిటీబ్యూరో
ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ప్రారంభించిన వెల్నెస్ సెంటర్లలో డాక్టర్లు అడ్డగోలుగా ప్రిస్క్రిప్షన్లు రాస్తున్నారని, దీన్ని అరికట్టాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోల్కొండ క్రాస్‌రోడ్డులోని సీపీఐ(ఎం) కార్యాలయంలో కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావుతో కలిసి బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వెల్నెస్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్రంలోని 12 వెల్నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతను పూర్తిగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించారని, ఒక్కరు కూడా రెగ్యులర్ డాక్టర్‌గానీ, అధికారిగానీ లేరని చెప్పారు. రెగ్యులర్ ఇన్చార్జి డాక్టర్లను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించినా నేటికీ అమలు కావడం లేదన్నారు. వెల్నెస్ సెంటర్లలో డాక్టర్లు రాస్తున్న ప్రిస్క్రిప్షన్లు అనాలోచితంగాను, ఆరోగ్యాలను దెబ్బతీసేవిధంగా ఉంటున్నాయని ఆరోపించారు. పేషెంట్లకు అవసరం లేకున్నా 12 నుంచి 19 రకాల మందులు రాస్తున్నారని, తెలియక ఈ మందులు వేసుకుంటే అనారోగ్యానికి గురికాక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిస్క్రిప్షన్లను పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను డిమాండ్ చేశారు. వెల్నెస్ సెంటర్లలో కొందరు ఇన్చార్జి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. పేషెంట్లను అవసరం లేకున్నా కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తూ భారీగా దండుకుంటున్నారని విమర్శించారు. ఖరీదైన మందులను పేషెంట్ల పేరుతో నమోదు చేయించుకుని అక్రమంగా తరిలించుకుపోతున్నారని చెప్పారు. కాలం చెల్లిన అనేక రకాల మందులను తిరిగి ఫార్మా కంపెనీలకు పంపించకుండా నిల్వ ఉంచుతున్నారని వివరించారు. భారీ ఎత్తున ప్రజాధనం వృథా అవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలం చెల్లిన మందులు ఇస్తున్నట్టు గతంలో సీపీఐ(ఎం) బయటపెట్టిందని, ఆందోళనలు నిర్వహించిందని అయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఫార్మాకంపెనీలతో అధికారులు కుమ్మక్కై దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పారు. ప్రతి వెల్నెస్లో అవసరమున్న డాక్టర్లు లేరుగానీ.. అవసరానికి మించి దంత వైద్యులను నియమించారని, రోగులు నామమాత్రంగా వస్తున్నప్పటికీ ఖైరతాబాద్‌లో ఐదుగురు డెంటల్ డాక్టర్లను నియమించారని తెలిపారు. ఇతర అంశాలకు సంబంధించిన స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలని, డాక్టర్లను రెగ్యులరైజ్ చేసి రోగులకు మెరుగైన సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్నెస్ కేంద్రాల్లో టెస్టింగ్ ల్యాబ్‌లను ఎత్తివేసి శాంపిల్ కలెక్షన్ మాత్రమే చేస్తుండటం వల్ల రిపోర్టులు రావడానికి ఆలస్యమవుతోందని, తిరిగి ల్యాబ్‌లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.