Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిరక్షణపై దృష్టి ఏదీ..?
- 'సప్తాహం'లో చరిత్ర ఆచార్యులకు స్థానం లేదా..?
- నేటి నుంచి కాకతీయ ఉత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. కాకతీయ రాజుల 22వ వారసుడు కమల్ చంద్ర భాంజ్‌దేవ్ ప్రారంభించనున్నారు. అయితే, కాకతీయ రాజులు నిర్మించిన కట్టడాలను పరిరక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను సైతం ఏర్పాటు చేయలేకపోయాయి. యూనివర్సిటీలో ఆధునిక చరిత్రపైనే అధికంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లేకపోవడంతో కాకతీయుల చరిత్ర, శాసనాలు, నాణేలు, చిహ్నాలపై లోతుగా పరిశోధనలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు శాసనాలు చదివి చెప్పేవారే లేకుండా పోయారు. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో కాకతీయ ఉత్సవాల సందర్భంగా నీటిపారుదల రంగంలో కాకతీయుల కృషి, చేతి వృత్తిదారులపై సదస్సులు నిర్వహించారు. అలాంటి కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాన్ని ప్రస్తుతం ఉత్సవాల్లో భాగస్వాములుగా చేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. వరంగల్, హన్మకొండ నగర పరిసర ప్రాంతాల్లో వున్న ఎన్నో కాకతీయుల చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించకపోవడంతో భూగర్భంలో కలిసిపోతున్నాయని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 'సప్తాహం' వేడుకల్లోనైనా వాటికి గుర్తింపు ఇచ్చి పరిరక్షిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎన్నో కాకతీయుల కట్టడాలు ఉన్నాయి. వాటి పరిరక్షణ లేక భూగర్భంలో కలిసి పోతున్నాయి. ఈ తరుణంలో జరుపుకుంటున్న కాకతీయ వైభవ సప్తాహం వేడుకల్లో పలు కీలక ప్రాంతాలకు చోటు కల్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది. గతంలో కాకతీయ ఉత్సవాలకు వేదికగా మారిన వరంగల్ జిల్లా మొగిలిచర్ల ఏకవీర దేవాలయంలో ఈసారి వేడుకలు నిర్వహించడం లేదు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కోటగుళ్లులో కూడా వేడుకలు నిర్వహించకపోవడం గమనార్హం. ఆదివారం హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పలు సూచనలు చేసినా అమలు చేయడం లేదు. వేడుకలకు కనీసం నెలరోజుల ముందైనా ప్లానింగ్ చేయకుండా నాలుగు రోజుల్లో ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. దీంతో 'సప్తాహం' వేడుకలు అరకొర వసతుల నడుమ నిర్వహించడం పట్ల అటు చరిత్రకారులు, ఇటు సాహితీవేత్తలు పెదవి విరుస్తున్నారు. కాకతీయుల వారసుడు వస్తున్న తరుణంలో సమయం తీసుకోకుండా హడావుడిగా హైదరాబాద్‌లోనే నిర్ణయాలు చేసి, స్థానికంగా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
కేయూను విస్మరించిన వైనం..
కాకతీయుల పేరిట ఏర్పడిన కాకతీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగం ఆచార్యులను భాగస్వాములను చేయకుండానే కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను నిర్వహిస్తున్నారు. కేయూ చరిత్ర విభాగంలోని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు కాకతీయుల చరిత్ర, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, దేవాలయాలు, చెరువులు, చేతి వృత్తిదారులు, పూజా విధానం తదితర అంశాలపై పరిశోధనలు చేశారు. ఎంతో మంది పరిశోధకులు పరిశోధనా పత్రాలను సమర్పించి డాక్టరేట్లు తీసుకున్నారు. అలాంటి చరిత్రకారులను భాగస్వామ్యం చేయకుండా ఉత్సవాలు నిర్వహించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది.
కట్టడాల పరిరక్షణేదీ ..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయుల నిర్మాణ తీరుతెన్నులకు త్రికుటాలయాలు తార్కాణం. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూ ర్లో నిర్మించిన 2 త్రికుటాలయాలు, ములుగు జిల్లాలోని జాకారంలో నిర్మించిన ఒకే గర్భలయంతో నిర్మించిన దేవాలయం, గణపురంలోని కోటగుళ్లు, వెంకటాపూర్ మండలంలోని రామాంజపూర్‌లోని ఎరుకేశ్వరీ దేవాలయం, వరంగల్ జిల్లా మొగిలిచర్లలోని ఏకవీర దేవాలయం, హన్మకొండ జిల్లాలోని కొండపర్తిలోని త్రికుటాలయం, జఫర్‌గఢ్ మండలంలోని రుఘునాథ్పల్లి త్రికుటాలయం శిధిలావస్థకు చేరుకున్నాయి.
నేటి నుంచి కాకతీయ వైభవ సప్తాహం
కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాన్ని గురువారం హన్మకొండ వేయి స్తంభాల దేవాలయంలో కాకతీయ రాజుల 22వ వారసుడు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ లాంఛనంగా ప్రారంభించారు. 700 ఏండ్ల తరువాత వరంగల్‌కు వస్తున్న కాకతీయ రాజుల వారసుడికి ఘనంగా స్వాగతం పలకడానికి అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాలను 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.50 లక్షలు మంజూరు చేసింది. గురువారం ఉదయం కాకతీయ రాజుల వారసుడు కమల్‌చంద్ర భాంజ్‌దేవ్ భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ఉత్సవాలను ప్రారంభిస్తారు.