Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో 'బదిలీ వర్కర్ల'కు గుర్తింపు కరువు
- ఏడాదిలో మస్టర్లు పూర్తి చేసినా పట్టించుకోని వైనం
- గుర్తింపు సంఘం ఎన్నికలప్పుడే సర్కారు హడావిడి
- 2019 నుంచి ఆ ఊసే ఎత్తకుండా యాజమాన్యం మీనమేషాలు
- వేజ్‌బోర్డు అలవెన్సులూ ఇవ్వకుండా కోతలు
- సర్వీసు కాలంలో ఉద్యోగోన్నతుల్లేక నష్టం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సింగరేణి ప్రతినిధి
సింగరేణి బొగ్గుగనుల క్షేత్రాల్లో బదిలీ వర్కర్లకు తీరని అన్యాయమే జరుగుతోంది. వారిని పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించకుండా ఆర్థికంగానూ, మానసికంగానూ యాజమాన్యం దెబ్బతీస్తోంది. కేవలం ఎన్నికల సమయంలోనే బదిలీ వర్కర్ల ఓట్లు సంపాదించేందుకు అధికార పార్టీ అనుబంధ యూనియన్ ప్రతిపాదనతో.. 2019 కంటే ముందు రాష్ట్ర సర్కారు ఆఘమేఘాల మీద పర్మినెంట్ చేయించింది. అందులో కొందరికి మజ్దూర్‌గా ప్రమోషన్ కల్పించి చేతులు దులుపుకుంది.
భూగర్భ గనుల్లో పని చేసే కార్మికుడు ఏడాదిలో 190 మస్టర్లు, సర్ఫేస్ విభాగంలో పని చేసేవారు 240 మస్టర్లు పూర్తి చేస్తే పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని నిబంధనలు ఉన్నా.. వాటిని బుట్టదాఖలు చేసిన యాజమాన్యం నాలుగేండ్లుగా ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా వేజ్‌బోర్డు అలవెన్సులు ఇవ్వకుండా కోతలు విధిస్తుంటే సర్వీసు కాలంలో ఉద్యోగోన్నతుల్లేక బదిలీ వర్కర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.
సింగరేణి వ్యాప్తంగా సుమారు 4వేల మందికిపైగా బదిలీ వర్కర్లు పని చేస్తున్నారు. వీరి విధులు చూస్తే.. ఆయా విభాగాల్లో ఎక్కడ ఏ వర్కరు ఖాళీగా ఉన్నా ఆ పనులను వీరితో చేయించుకుంటారు. ప్రత్యేకంగా ఓ పని అంటూ ఏదీ ఇవ్వకుండా అవసరమున్న చోట యాజమాన్యం ఈ వర్కర్లను వినియోగించుకుంటోంది. ప్రధానంగా భూగర్భ గనుల్లో అతికీలకమైన కోల్ కట్టర్, సపోర్ట్‌మెన్, ట్రామర్, పంపు ఆపరేటర్, ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్లు పని చేసే చోట్లలో ఎక్కడ ఏ వర్కరు ఖాళీగా ఉన్నా.. (యాక్టింగ్ పేరుతో) బదిలీ వర్కర్లను ఆ పనులకు పంపి రికార్డు చేస్తుంటారు. ఇలా ఏ పని చెప్పినా వెంటనే ఆ విధుల్లోకి వెళ్తున్న బదిలీ వర్కర్లకు యాజమాన్యం ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
యాక్టింగ్వర్క్తో మిగిలేది అరకొరే..
ఆయా విభాగాల్లో ఎక్కడ ఏ విభాగం వర్కరు ఖాళీగా ఉన్నా.. ఆ పనులు చేసేందుకు వెళ్లిన బదిలీ కార్మికుడికి కేవలం అరకొర అలవెన్సులు మాత్రమే మిగులుతున్నాయి.
ఆ శ్రమకు తగ్గ ఫలితం, గుర్తింపు కరువవుతోంది. కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా తమను అన్ని పనులకూ వినియోగించుకుంటున్నారని కొందరు ఎదురు ప్రశ్నిస్తే.. అక్కడి సూపర్వైజర్లకు, బదిలీ వర్కర్లకు మధ్య గొడవలు చోటుచేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు వేజ్‌బోర్డు ద్వారా కార్మికులకు చెల్లించాల్సిన అనేక అలవెన్సులను బదిలీ వర్కర్లకు వర్తింపజేయకుండా సింగరేణి యాజ మాన్యం కోత విధిస్తోంది. కోల్‌మైన్స్ స్పెషల్ అలవెన్సు 4శాతం కూడా ఇవ్వడం లేదు. ఇక సర్వీసు కాలంలో లభించే ఉద్యోగోన్నతులకు నోచుకోవడం లేదు. ఉద్యోగోన్నతి లేక, సర్వీసులో తమకంటే జూనియర్లతో పని చేస్తూ ఆర్థికంగానూ, మానసికంగానూ నష్టపోతున్నామని కొందరు బదిలీ వర్కర్లు 'నవతెలంగాణ'తో వాపోయారు.
భవిష్యత్ అగమ్య గోచరం
బదిలీ వర్కర్ అంటే అందరికీ చిన్న చూపే! ఎవరూ చేయని కష్టమైన పనులను మాతో చేయిస్తున్నారు. పే డే, పేయిడ్ హాలిడేలో పని చేయడానికి అర్హులం కాదంటున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతర్గతంగా పూరించే ఖాళీలకు బదిలీ వర్కర్లు అర్హులు కాదంటున్నారు. మా భవిష్యత్తు దెబ్బతింటుంది. సీనియార్టీ కోల్పోతున్నాం, క్వార్టర్ సౌకర్యం లభించడం లేదు. ఓసీపీ, సర్ఫేస్ పని స్థలాలకు వెళ్లి పనిచేయాలంటే బదిలీ వర్కర్లకు అవకాశం లేదు.
- కె.బుచ్చిబాబు- బదిలీ వర్కర్