Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు సీజన్ మొదలవడంతో ఫారెస్టోళ్ల దాడులు
- పెనుబల్లి మండలం చౌడవరంలో అడ్డుపడిన సిబ్బంది
- అరకలను అడ్డుకుని.. ఆడా మగా తేడా లేకుండా దాడి
- దరఖాస్తులు తీసుకుని ఏడునెలలైనా జాడలేని హక్కుపత్రాలు
- రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు పెండింగ్
పోడుదారులపై మళ్లీ అటవీశాఖ దాడులు మొదలయ్యాయి. వానాకాలం సీజన్ ప్రారంభమవడంతో పంటలు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకుంటున్న పోడు రైతులను ఫారెస్టోళ్లు ఎప్పటిలాగే ఇబ్బంది పెడుతున్నారు. దుక్కులు దున్ని విడిచివెళ్లిన అరకలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్తున్నారు. హక్కుపత్రాలు ఇస్తాం.. కానీ కొత్తగా పోడు కొట్టొద్దన్న ప్రభుత్వ హామీకి లోబడి సాగుదారులు వ్యవహరిస్తున్నారు. కానీ ఫారెస్టు సిబ్బంది మాత్రం నిబంధనలు అతిక్రమించి, ప్రభుత్వం ఇచ్చిన హామీని విస్మరించి.. దాడులకు తెగబడుతున్నారని గిరిజనులు వాపోతున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చౌడవరం పంచాయతీ పరిధిలో మంగళవారం గిరిజన రైతులు, అటవీశాఖ అధికారుల మధ్య పోడు రగడ జరిగింది చౌడవరంలోని గిరిజనులు 15 ఏండ్లుగా సమీప అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. వర్షాలు పడుతుండటంతో మూడునాలుగు రోజులుగా దుక్కులు దున్నుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అరకలను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లారు. మరుసటి రోజు పోడుదారుల దారికి అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలో పోడుదారులు, అటవీశాఖ సిబ్బంది మధ్య తోపులాట జరిగింది. అరక ఎడ్లను అడ్డగోలుగా కొట్టడంతో పోడుదారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. హక్కుపత్రాలిస్తామన్న ప్రభుత్వం ఆ హామీని విస్మరించడమే కాకుండా అటవీశాఖ సిబ్బందితో దాడులు చేయిస్తోందని ఆవేదన చెందారు. హక్కు పత్రాలిస్తామని గతేడాది నవంబర్ 8 నుంచి 18వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షలకుపైగా దరఖాస్తులు సమర్పించారు. ఏడునెలలకు పైగా అవుతున్నా వాటికో పరిష్కారం చూపించకపోగా దాడులకు తెగబడటంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏడు లక్షల ఎకరాలకు గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తులు సమర్పించారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ సహా మొత్తం 24 జిల్లాలోని ఏడు లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. ఆయా జిల్లాల నుంచి 1.40 లక్షల వరకు గిరిజనులు, 1.10లక్షల వరకు గిరిజనేతరులు అప్లికేషన్లు సమర్పించారు. సుమారు 4.5 లక్షల ఎకరాల వరకు గిరిజనులు, రెండున్నర లక్షల ఎకరాలకు గిరిజనేతరులు దరఖాస్తులు చేశారు. ప్రభుత్వం ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు రావడంతో మీమాంసలో పడింది. ఆర్వోఎఫ్ఆర్- 2006 అమల్లోకి వచ్చాక ఆ ఏడాది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొంత మొత్తం పోడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోడుభూములపై ప్రకటన చేసిన కేసీఆర్ అమలు చేయకపోవడంతో ఉద్యమాలు కొనసాగాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండ లం ఎల్లన్ననగర్లోని 70 మంది బిట్ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్టోబర్ 5, 2021న కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు 'సడక్‌బంద్'కు పిలుపునివ్వడంతో దిగొచ్చిన ప్రభుత్వం హక్కుపత్రాల జారీకి ముందుకొచ్చింది. అఖిలపక్ష సమావేశాలు, హడావుడి చేసి ఆ తర్వాత మిన్నకున్నది.
అధిక దరఖాస్తులతో అగమ్యగోచరం
పోడుభూములపై హక్కు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానించే క్రమంలో ఖమ్మం జిల్లాలో 8,208 మంది 17,449 ఎకరాల్లో పోడు సాగిస్తున్నట్టు అశాస్త్రీయ శాటిలైట్ సర్వే ద్వారా జిల్లా యంత్రాంగం గుర్తించింది. కానీ గ్రామ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ కమిటీకి జిల్లాలో 18,603 మంది రైతులు 42,560.36 ఎకరాలకు హక్కు కల్పించాలని దరఖాస్తు చేశారు. భద్రాద్రి జిల్లాలో 82,737 మంది పోడు దారులు 2,94,890 ఎకరాల కోసం దరఖాస్తులు సమర్పిం చారు. గుర్తించిన భూమి కన్నా అధిక దరఖాస్తులు రావడం తో ప్రభుత్వం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పశువులను కొట్టారు..ఆడోళ్లను నెట్టారు
చౌడవరం రెవెన్యూలో 15 ఏండ్లుగా పోడుభూమి సాగు చేసుకుంటున్నాం. వర్షాలు కురుస్తుండటం తో మూడురోజులుగా అరకలు కడుతున్నాం. ఫారెస్టోళ్లు దారికాచి అడ్డుకున్నారు. అరక ఎడ్లను విపరీతంగా కొట్టారు. అడ్డువచ్చిన ఆడోళ్లనూ తోసివేశారు. మేము ప్రతిఘటించడంతో కేసులు పెట్టి సంగతి తేల్చుతా మంటూ వెళ్లిపోయారు. దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం మాపై ఫారెస్టోళ్లను ఊసిగొల్పడం సరికాదు.
పట్టే అనసూర్య- పోడు మహిళా రైతు