Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర చేనేతజౌళి శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్
- టెక్స్టైల్ పార్కు సందర్శన
- మా సమస్యలు పరిష్కరించండి.. పెట్టుబడులకు ముందుంటాం: టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం వినతి
నవతెలంగాణ - తంగళ్ళపల్లి
వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.. మీ సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపడతామని రాష్ట్ర చేనేత జగన్ బుద్ధప్రకాష్ జ్యోతి టెక్స్టైల్ పార్క్ యజమానులతో అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బతుకమ్మ చీరల ప్రాసెసింగ్ యూనిట్, టెక్స్టైల్ పార్కులో తయారవుతున్న బతుకమ్మ చీరల యూనిట్లను బుధవారం కమిషనర్ పరిశీలించారు. ముందుగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తయారవుతున్న బతుకమ్మ చీరల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన సందర్శించారు. బతుకమ్మ చీరలకు కావలసిన ముడి సరుకులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లను కూడా సందర్శించి వాటి వివరాలు తెలుసుకున్నారు. యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యజమానులు తమ సమస్యలను వివరిస్తూ.. టెక్స్టైల్ పార్కులో కొత్తగా యూనిట్లు స్థాపిస్తామంటే పేరు మార్పిడి కూడా జరగడం లేదని వాపోయారు. రూ.కోట్లు ఖర్చు చేసి యూనిట్లు స్థాపిస్తే ప్రభుత్వ ఆధీనంలోనే ఆస్తులు ఉంటున్నాయని తెలిపారు. ఇతర కుటుంబ సభ్యులపైన పేర్లు మార్పిడి చేసి యూనిట్లను స్థాపిద్దామనుకుంటే ఆ యూనిట్ల ప్రాసెసింగ్ కూడా జరగడం లేదని చెప్పారు.
చాలావరకు నూతనంగా యూనిట్లను స్థాపించడం కోసం ఎవరూ ముందుకు రావడం లేదని, బతుకమ్మ చీరల తయారీలో ముడిసరుకు ధరలు కూడా అధికంగా పెరిగాయని అన్నారు. టెక్స్టైల్ పార్కులో కనీసం 5వేల మంది కార్మికులకు పని దొరుకుతుందనుకుంటే 1500మంది కార్మికులు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. పార్కులో ఎన్నో సమస్యలున్నాయని, వాటిని త్వరగా పరిష్కరిస్తే ఎంతో మంది ముందుకు వచ్చి మరిన్ని యూనిట్లు స్థాపించేందుకు ఉత్సాహం చూపుతారన్నారు. అనంతరం కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ.. ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ప్రతి ఏటా బతుకమ్మ చీరల తయారీలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో.. అదే మాదిరిగా ఈసారీ చీరల తయారీ చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లను కూడా నాణ్యతగా తయారు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న యూనిట్లు కుటుంబ సభ్యుల పేరుపైనగానీ విక్రయించే విధంగాగానీ చేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. కమిషనర్ వెంట జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో శ్రీనివాసరావు, పీఎస్ శ్రీనివాస్, చేనేత జౌళిశాఖ అధికారులు ఉన్నారు.