Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పట్నం' డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో వివిధ పథకాల కింద అర్హులుగా ఎంపికైన 11.16 లక్షల మంది పేదలు నాలుగేండ్లుగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారనీ, వారందరికి పాత బకాయిలతో సహా తక్షణం మంజూరీలు ఇవ్వాలని పట్నం (తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు పట్నం ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. చనిపోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా అర్హులుగా గుర్తించబడి పెండింగ్లో ఉన్నవారు 3.16 లక్షల మంది ఉన్నారనీ, వీరిలో 1.60 లక్షల మంది వితంతువులు, వృద్ధులు 64,750 మంది, వికలాంగులు 55,620 మంది కాగా, 57 ఏండ్ల వృద్ధాప్య ఫించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు కూడా ఉన్నారని తెలిపారు. మండల, జిల్లా స్థాయిల్లో మరో 8 లక్షల మందిని అర్హులుగా ఎంపికచేశారనీ, వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలుపలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెన్షన్దారులందరినీ కదిలించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాసంఘాలన్నీ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.