Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి కాలేజీలతో టీఏఎఫ్ఆర్సీ సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల కోర్సుల ఫీజులను ఖరారు చేయడంపై తెలంగాణ అడ్మిషన్ అండ్ పీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కసరత్తు ప్రారంభించింది. గురువారం నుంచి కాలేజీ యాజమాన్యాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను గతంలోనే జారీ చేసింది. 145 కాలేజీ యాజమాన్యాలకు సమాచారం అందించింది. దాని ప్రకారం ప్రతి రోజూ 15 కాలేజీల యాజమాన్యాలతో టీఏఎఫ్ఆర్సీ సంప్రదింపులు జరపనుంది. ఈనెల 20 వరకు ఈ ప్రక్రియను చేపట్టనుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ ఫీజుల ఖరారు చేయనుంది. ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించనుంది. 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాల బ్లాక్ పీరియడ్‌కు టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసే ఫీజులు అమల్లో ఉంటాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిర్ణయించిన ఫీజులను అమలు చేయబోమనీ, సొంతంగా ఫీజులను ఖరారు చేస్తామంటూ టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో గరిష్టంగా రూ.1.34 లక్షలు, కనిష్టంగా రూ.35 వేల ట్యూషన్ ఫీజు అమల్లో ఉన్నది. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఫీజు అత్యధికంగా రూ.1.34 లక్షలు వసూలు చేస్తున్నది. అయితే 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాలకు రూ.మూడు లక్షల వరకు ఫీజు పెంచాలని టీఏఎఫ్ఆర్సీని సీబీఐటీ యాజమాన్యం ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది. ఎంజీఐటీ ఫీజు ప్రస్తుతం రూ.1.08 లక్షలున్నది. ఆ ఫీజును రూ.రెండు లక్షలకు ఖరారు చేయాలని టీఏఎఫ్ఆర్సీని కోరింది. అయితే సీబీఐటీ, ఎంజీఐటీ కాలేజీల 2016-17, 2017-18, 2018-19 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఇటీవల సవరించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం సీబీఐటీ ఫీజును రూ.1,13,500 నుంచి రూ.1.40 లక్షల వరకు ఎంజీఐటీ ఫీజును రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు టీఏఎఫ్ఆర్సీ పెంచింది. 2019-20, 2020-21, 2021-22 బ్లాక్పీరియడ్కు సీబీఐటీ ఫీజు రూ.1.34 లక్షలు, ఎంజీఐటీ పీజు రూ.1.08 లక్షలపై ఎలాంటి వివాదం లేదు. వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు ప్రస్తుతం రూ.1.30 లక్షలున్నది.