Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ...
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలనీ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. బుధవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, ఎం రవీందర్, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, ఎస్ హరికృష్ణ, వి శ్రీనివాస్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యామంత్రి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటిస్తామంటూ విద్యామంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బడులు ప్రారంభమైనా ఆ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. విద్యారంగం, పేద పిల్లల జీవితాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పర్యవేక్షణ అధికారుల్లేక ప్రమాణాలు దిగజారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు. ఉపాధ్యాయ ఖాళీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినా ఉన్న వారే బోధించాల్సి వస్తున్నదని వివరించారు. ఇప్పటికే సుమారు 21,500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, ఆంగ్ల మాధ్యమంతో మరింత మంది అవసరమని చెప్పారు. ఉపాధ్యాయ ఖాళీలు, పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉంటే విద్యార్థులకు నాణ్యమైన బోధన ఎలా అందుతుందని ప్రశ్నించారు. శాశ్వత నియామకాలు చేపట్టే వరకు విద్యావాలంటీర్లను వెంటనే నియమించాలన్నారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని కోరారు. ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని అన్నారు. విద్యారంగానికి గతంలో 13 శాతం నిధులు కేటాయిస్తే ఇప్పుడు 6.26 శాతానికి తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడులు ఎగ్గొట్టి రియల్ఎస్టేట్ వంటి వ్యాపారాలు చేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఉపాధ్యాయులంతా బడి ఎగ్గొట్టి వ్యాపారాలు చేయడం లేదనీ, విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారని వివరించారు. అందుకే పదో తరగతి ఫలితాల్లో సర్కారు బడుల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని చెప్పారు. ఉపాధ్యాయులు బడికి రాకుండా సరిగ్గా పనిచేయడం లేదంటే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. పర్యవేక్షణ వ్యవస్థను పెంచి వారు బడులకు వచ్చేలా చూడాలనీ, విద్యార్థులకు బోధన అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ నాయకులు పి మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.