Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఆదేసం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మన ఊరు - మన బడి కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నీచర్ కొనుగోళ్లకు ఇచ్చిన టెండర్‌ను ఖరారు చేయవద్దని హైకోర్టు రాష్ట్రానికి ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియను కొనసాగించవచ్చుననీ, అయితే, తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు టెండర్లను ఖారారు చేయరాదని బుధవారం హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. మే 9న జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిందని వి3 ఎంటర్ ప్రైజెస్ ప్రయి వేట్ లిమిటెడ్, జెనిత్ మెటఫాస్ట్ ప్రయివేట్ లిమిటెడ్, మరో రెండు కంపెనీలు హైకోర్టులో సవాలు చేశాయి. టెండర్ కండిషన్స్ ప్రకారం అన్ని అర్హతలు ఉన్నా పిటిషనర్ల కంపెనీలను అనర్హత ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారని పిటిషనర్ల వాదన. అర్హతల డాక్యుమెంట్స్ పిటినర్లు సమర్పించిందీ లేనిదీ చూడాలని ప్రభుత్వం చెప్పింది. దీంతో ఆ వివరాలను 11న జరిగే విచారణలో అందజేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
ఆజాద్ ఎన్కౌంటర్ కేసును మళ్లీ విచారణ చేయండి.హైకోర్టు ఆదేశం
మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అనే చెరుకూరి రాజ్‌కుమార్, మరొకరు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పోలీసులను నిందితులుగా పేర్కొంటూ ఆ జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. పోలీసుల వాదనలు వినకుండా సమన్లు జారీ చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. తిరిగి చట్ట ప్రకారం 29 మంది పోలీసులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు విన్న తర్వాతే తుది ఉత్తర్వులు ఇవ్వాలని ఆ జిల్లా కోర్టును ఆదేశించింది. మూడు నెలల్లోగా కింది కోర్టు కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ బుధవారం తీర్పు వెలువరించారు. 2010లో సర్కపల్లి దగ్గర్లోని జోగాపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఆజాద్, జర్నలిస్ట్ పాండేల ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అది బోగస్ ఎన్కౌంటర్ కాదని సీబీఐ ఇచ్చిన రిపోర్టును ఆజాద్ భార్య పద్మ, పాండే భార్య బినీత జిల్లా కోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో 29 మంది పోలీసులకు జిల్లా కోర్టు ఇచ్చిన నమన్లను హైకోర్టులో సవాలు చేయడంతో ఈ తీర్పు వెలువడింది.
హైకోర్టులో 65 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర హైకోర్టులో 65 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయినట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కె.సుజన తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జడ్జీలు, రిజిస్ట్రార్ల వద్ద కోర్టు మాస్టర్స్, పర్సనల్ సెక్రెటరీలు 65 మందిని నేరుగా నియమించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. మరిన్ని వివరాల కోసం హైకోర్టు వెబ్సైట్ http://tshc.nic.in లో చూడవచ్చు.