Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల ఆత్మగౌరవంపై కేసీఆర్ దెబ్బ
- అసైన్డ్భూములను గుంజుకుంటున్నారు
- రెవెన్యూ సదస్సులతో సర్కారు కొత్త డ్రామా
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు: ఇందిరాపార్కు దీక్షలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విమర్శించారు. పేదల ఆత్మగౌరవాన్ని సీఎం కేసీఆర్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పంచిన అసైన్డ్భూములను వివిధ పేర్లతో గుంజుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామనీ, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ సుంకేట అన్వేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భూబాధితులు తమ సమస్యలను నేతల ముందు ఏకరవు పెట్టారు. పేదల ఆత్మగౌరవంపై కేసీఆర్ సర్కారు దాడి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రశ్నించిన వారికి సంకెళ్లు వేసి నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన నేలను సీఎం కేసీఆర్ మళ్లీ పాత రోజలను తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు, రింగ్‌రోడ్లు, లేఅవుట్ల పేరుతో ప్రభుత్వమే కబ్జా చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను రద్దు చేయడమే మార్గమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతున్నదని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ అద్భుతమనీ, సర్వోరోగ నివారిణి అంటూ సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పారనీ, అయితే దాంతో ఎంతో మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు చింతల పల్లి మండలం లక్ష్మాపూర్‌లో ధరణి మొదలు పెట్టారనీ, పేదలకు ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్‌ను వివిధ కారణాలతో గుంజుకుంటున్నారని విమర్శించారు. వరంగల్‌లో కూడా డెవలప్మెంట్ పేరుతో లొక్కొనే ప్రయత్నం చేసిందనీ, భూపోరాటాలు జరిగిన తర్వాత వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. లక్ష్మాపూర్ గ్రామమే రెవెన్యూ పరిధిలో లేదనీ, 800 మందికి పట్టాలివ్వకపోతే తాను కొట్లాడితే 200 మందికి పట్టా లిచ్చారని గుర్తు చేశారు. తరతరాలుగా వస్తున్న భూమిని అన్యాయంగా లాక్కుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వమే పేదల భూములు లాక్కోవడం సిగ్గు చేటని పేర్కొన్నారు. పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతకాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకేసారి 25 లక్షల ఎకరాల భూములను పంచిందని గుర్తు చేశారు. ఐదు లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆగమవుతున్నాయని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా రైతులకు బేడీలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులో ఎకరాకు రూ మూడు కోట్లకు తక్కువ లేదనీ, కేసీఆర్‌ను సీఎం పదవిలో కూర్చొబెట్టింది...పేదల భూములను గుంజుకోడానికేనా? అని ప్రశ్నించారు. అడ్డగోలుగా పేదల భూములు గుంజుకొని కోట్ల రూపాయలు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. పాత రికార్డులన్నీ మాయం చేసి రెవెన్యూ వ్యవస్థను ఆగం చేశారని విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రాతిపాదికగా మీ భూమి పైకి ఎవరన్న వస్తే... తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. రెవెన్యూ సదస్సుల పేరుతో సీఎం కేసీఆర్ కొత్త డ్రామా అడుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు జాగా లేదని చెబుతున్న కేటీఆర్...ఐకియాకు ఇచ్చిన భూమిలో ఇండ్లు కట్టాలని సూచించారు. తెలంగాణ భూపోరాటాలకు వీరనారి ఐలమ్మ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారనీ, ఆ పోరాటమే తెలంగాణ ఉద్యమానికి దారితీసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, అంజన్‌కుమార్‌యాదవ్, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్, సీనియర్ నాయకులు వి హనుమంతరావు, ఎం కోదండరెడ్డి, మల్లు రవి, అధికార ప్రతినిధి కృష్ణతేజ, కార్పొరేటర్ విజయారెడ్డి, గాలి అనిల్‌కుమార్,అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు ఉన్నారు.