Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- కరీంనగర్
వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని సీపీఐ(ఎం) కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వంట గ్యాస్ బండపై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మిల్కురి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. అచ్చేదిన్ ఆగయా అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న నరేంద్ర మోడీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ.. ప్రజలు సచ్చే దినాలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్ బండ ధర.. నేడు రూ.1105కి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజలను మభ్యపెడుతూ తీవ్రమైన భారాలు వేస్తున్నారని తెలిపారు. దేశ సంపదనంతా అదాని, అంబానీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పారు. పైగా ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుడికందుల సత్యం, నరేష్, జీ.తిరుపతి, పున్నం రవి, కొంపల్లి సాగర్, శారద, పుల్లెల మల్లయ్య, ఉప్పునూటి లక్ష్మి, సురేష్, చిర్ర స్వామి, అజయ్, జి.సదయ్య, ఎండీ అజార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.