Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గృహ వినియోగం కోసం ప్రజలు వాడుకునే గ్యాస్ సిలిండర్ ధరలను వరుసగా పెంచటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోయలేని భారాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే..బుధవారం మరోసారి రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం సరికాదని పేర్కొన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేండ్ల క్రితం మూడొందల యాభై రూపాయలున్న గ్యాస్ సిలిండర్ ధర, నెల నెలా పెంచుతూ పోతున్నారని తెలిపారు. పేదలకిచ్చే సబ్సిడీ ఎత్తేయడంతో రూ.1,105కు చేరిందని పేర్కొన్నారు.
ఆ సిలిండర్ ఇంటికి చేరేసరికి రూ.1,150 నుంచి పన్నెండొందలు చెల్లించాల్సి వస్తున్నదని తెలిపారు. మరో పక్క అన్ని రకాల నిత్యావసర సరుకుల, వస్తువల ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు అదుపు లేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజల జీవన అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరను ఉపసంహారించుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది.