Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులందరికీ స్థలాలివ్వాలి
- సీపీఐ(ఎం) నాయకులను వెంటనే విడుదల చేయాలి
- 15 రోజుల్లోగా ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం: సీపీఐ(ఎం) డిమాండ్
నవతెలంగాణ-మెదక్డెస్క్
నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అడిగితే అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ సీపీఐ(ఎం) నేతలు అధికారులను నిలదీశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పేదలందరు కొన్ని రోజులుగా పోరాటం చేస్తు న్నారు.. పేదలకు అండగా నిలబడిన సీపీఐ(ఎం) నాయకుడు వి.ప్రవీణ్ కుమార్ను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) నాయకులు, నిరుపేదలు బుధవారం సదాశివపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, కార్యదర్శివర్గ సభ్యులు మాణిక్యం, బి మల్లేశం మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా అద్దె ఇండ్లల్లో ఉంటూ అవస్థలు పడుతున్నామని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బడాబాబులు వందలాది ఎకరాల భూములను కబ్జా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇండ్ల జాగలడిగితే.. అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. పట్టణంలో ప్రజలు అద్దె కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో భారం మోయలేని విధంగా తయారైందన్నారు. ప్రస్తుతం పేదలు ఇంటి కిరాయిలు భరించే పరిస్థితిలో లేరన్నారు. వెంటనే అర్హులైన వారందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సదాశివపేట తహసీల్దార్ ఆశాజ్యోతి మాట్లాడుతూ.. 15 రోజుల్లో అర్హులైన పేదలను, ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వ ఆదేశానుసారం ముందుకెళ్తామని తెలిపారు. కార్య క్రమంలో సీపీఐ (ఎం) నాయకులు పి.అశోక్ రమేష్ గౌడ్, అనిల్, దాసు తదితరులు పాల్గొన్నారు.