Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్‌కు కమల్ చంద్ర
- ఆహ్వానం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్‌ను పరిపాలించిన కాకతీయుల కళావైభవం ఘనచరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేందుకు 'కాకతీయ వైభవం సప్తాహం' పేరుతో ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కాకతీయ వంశం 22వ వారసులు కమల్‌చంద్ర బాంజ్‌దేవ్ గురువారం వరంగల్ జిల్లా ఖిలావరంగల్‌కు విచ్చేశారు. మొదటగా భద్రకాళి అమ్మవార్లను దర్శించుకొని పోచమ్మ మైదాన్ కూడలిలో ఉన్న రాణి రుద్రమదేవి విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం కాశిబుగ్గ, వెంకట్రామా థియేటర్, తెలంగాణ జంక్షన్, చింతల్ ఫ్లైఓవర్ నుంచి కోట గండికి చేరుకున్న అనంతరం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కోటలోకి ఆహ్వానం పలికారు. జనగామ జిల్లా మాణిక్యాపూర్ నుంచి 300 మంది డోలు వాయించే కళాకారులు, పెంబర్తి నుంచి 300మంది కోలాటం కళాకారుల డోలు తప్పట్లు, బోనాలతో ప్రత్యేక నృత్యాలు ప్రజలను ఆకర్షించాయి. స్వయంభూ శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కమల్ చంద్ర.. ఖిలావరంగల్ కాకతీయ ప్రదర్శనశాలలో ఉన్న కాకతీయుల పురాతన శిల్పాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. కాకతీయ ప్రదర్శనశాలలో బెలూన్లను గాలిలోకి వదిలారు. అనంతరం కమల్ చంద్ర భంజ్ దేవ్ మాట్లాడుతూ.. తమ వంశంలో ఏడు అనే సంఖ్యను అదృష్టంగా భావిస్తామని, అందుకే ఈ రోజు వరంగల్‌కు వచ్చినట్టు చెప్పారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు ఉన్నట్టుగా ఛత్తీస్‌గఢ్‌లో కాళీదేవి అమ్మవారు ఉందన్నారు. ఖిలావరంగల్‌లో కోట కట్టడాల లాగానే ఛత్తీస్‌గఢ్‌లో కోటల కట్టడాలూ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, డాక్టర్ బండా ప్రకాశ్, ప్రొఫెసర్ పాండు రంగారావు, వరంగల్ కలెక్టర్ గోపి, పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, డీసీపీ పుష్ప, ఆర్డీవో మహేందర్‌జీ తహసీల్దార్లు సత్యపాల్ రెడ్డి, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.