Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉత్పాదకత పెంచే పత్తి వంగడాలు దేశానికి ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మనదేశ కమతాలకు తగిన యంత్రాలు రావాలనీ, ఆ దిశగా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు వేగవంతం చేయాలని కోరారు. పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంద్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా గురువారం అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న రైతులు రిచర్డ్ కెల్లీ, బ్రాడ్ విలియమ్స్ వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, డాక్టర్ మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, సీడ్ ఎండీ కేశవులు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికా వ్యవసాయ కమతాలు అతి పెద్దవనీ, వాటితో పోల్చుకుంటే మనదేశ కమతాలు చాల చిన్నవన్నారు. వాటికి సరిపోయేలా యాంత్రీకరణ జరిగితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతున్నదన్నారు.అమెరికా యాంత్రిక వ్యవసాయంలో ఎకరాకు 30వేల పత్తి మొక్కలు పెంచుతున్నారని చెప్పారు. చీడపీడల బెడద తక్కువగాఉందన్నారు. సగటున వెయ్యి ఎకరాల నుంచి ఐదువేల ఎకరాల కమతాలు...రోజుకు 70 టన్నులు పత్తి తీసే యంత్రాలు ఉన్నాయని తెలిపారు. 200 ఏండ్లుగా అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలో ప్రధాన పంట పత్తి పండుతున్నదని పేర్కొన్నారు. కాలక్రమంలో పత్తి సాగులో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.అనంతరం సింగిల్ పిక్ కాటన్ సాగు, విత్తన తయారీ కేంద్రం, జిన్నింగ్ మిల్‌ను వారు సందర్శించారు.
మీటర్లపై కేంద్రం మొండి పట్టుదల వీడాలి: నిరంజన్‌రెడ్డి
వ్యవసాయ మోటార్లకు మీటర్లపై కేంద్ర ప్రభుత్వం మొండి పట్టుదల వీడాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై చట్టంలో సవరణల యోచన, వరిసాగు పెంచాలంటూ రాష్ట్రాలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సూచనలపై అమెరికా పర్యటన నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అనవసర ప్రతిష్టకు పోకుండా భారత రైతాంగ ప్రయోజనాలు, ఇక్కట్లను దృష్టిలో పెట్టుకుని మొత్తానికి మొత్తం ప్రతిపాదిత చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. కేవలం రాజకీయ కోణంలో చూసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. మోటార్లకు మీటర్ల బిగింపు విషయంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలను కేంద్రం పెడచెవిన పెట్టిందని విమర్శించారు.