Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి సంజయ్‌కి రేవంత్ సవాల్
- కాంగ్రెస్ నేతలపై సోషల్‌మీడియాలో దుష్పచారం చేస్తే చర్యలు
- రాహుల్‌కు హనుమంతుడిలా పని చేస్తా
- పీసీసీ అధ్యక్షపదవి కంటే ఇంకేం కావాలి: గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌కి దమ్ముంటే, ఆర్టీఐకి కింద కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల్లో అవినీతిపై సమాచారం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. సచివాలయమే లేదు.. అక్కడికి సీఎం ఎన్ని సార్లు వచ్చారో చెప్పాలని అడగడమేంటని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందం ప్రజలకు తెలుసని చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా గురువారం గాంధీభవన్‌లో ఆయన్ను సత్కరించారు. ఈ సందర్భంగా సీడబ్య్లూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఎన్నికైన మాజీ ఎంపీ టి సుబ్బరామిరెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్, జులైలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులపై దుష్పచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 365 రోజుల తర్వాత సోనియాగాంధీ ఎవరు ముఖ్యమంత్రి అని చెపితే వారిని పల్లకిలో మోసికెల్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతానన్నారు. దేశానికి రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రి చేసేందుకు ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. ప్రధాని, సీఎం పదవుల కంటే అత్యంత ముఖ్యమైన అధ్యక్ష పదవిని సోనియాగాంధీ అప్పగించారని చెప్పారు.
రాహుల్‌గాంధీకి హనుమంతుడిలా పని చేస్తానన్నారు. కేసీఆర్ రావణాసురుడిలాంటి వాడని చెప్పారు. ఆయన్ను అంతమోదించేందుకు యుద్ధం చేస్తానన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత నిత్యవసర ధరల పెంపుదలకు నిరసనగా, దళిత,గిరిజన దండోరా, నిరుద్యోగ సైరన్, రాజ్‌భవన్‌ను ముట్టడి, వరంగల్ డిక్లరేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. 90 రోజుల్లో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన ఎర్రశేఖర్,బిల్యానాయక్
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్, భట్టి
మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, దేవరకొండ టీడీపీ సీనియర్ నేత బిల్యా నాయక్‌తోపాటు 400 మంది వివిద పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మహేష్ కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు.
త్వరలో గిరిజన సభ...
రాహుల్‌కు ఆహ్వానం : భట్టి విక్రమార్క
రాష్ట్రంలో భారీ గిరిజన సభ పెట్టి రాహుల్‌గాంధీని ఆహ్వానిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రచ్చబండ తరహాలో కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని గడపగడపకు తీసుకెళ్తామని చెప్పారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో దండయాత్ర చేసి సభలు సమావేశాలు నిర్వహిస్తే...సీఎం కేసీఆర్ రాష్ట్రానికి రావాల్సిన హామీలు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.