Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోర్డు తిప్పేసిన కంపెనీ
- వెయ్యి మంది నుంచి రూ.పది కోట్లు వసూలు
- ఏదుల ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ ఎదుట బాధితుల ధర్నా
నవతెలంగాణ- బోడుప్పల్
ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఓ కంపెనీ.. ఒత్తుల తయారీ పేరుతో కోట్లు కొళ్లగొట్టింది. జనాల నుంచి దాదాపు పదికోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలస్వామి మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మారుతినగర్లో నివాసం ఉండేవాడు. వొత్తులు తయారీకి అవసరమైన మెషినరీలను విక్రయించే వ్యాపారం చేసేవాడు. దీనిని యూట్యాబ్తోపాటు ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఇంటివద్దే ఉంటూ ఆదాయం సంపాదించుకోవచ్చని పలువురు నమ్మారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వారు కూడా సుమారు వెయ్యి మంది వరకు వొత్తులు తయారీ చేసే మెషినరీలను కొనుగోలు చేశారు.
ఇంటి వద్దే ఉంటు అధిక ఆదాయం పొందొచ్చనే..
బాలస్వామి విక్రయించే మెషినరీ ధర రూ.1.77 లక్షలు. వొత్తులకు కావాల్సిన కాటన్ కూడా అతనే విక్రయించడం, తయారైన వొత్తులను అతనే కొనుగోలు చేసే విధంగా వ్యాపారం నిర్వహించాడు. పత్తి కోసం అడ్వాన్స్‌గా డబ్బులు కట్టించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాపారం రెండు నెలలపాటు సజావుగానే సాగించినట్టు అందరినీ నమ్మించి.. నాలుగు నెలల నుంచి ఎక్కువ సంఖ్యలో మెషిన్లను విక్రయించాడు. ఇలా దాదాపు వెయ్యి మంది నుంచి సుమారు రూ.పది కోట్ల వరకు వసూలు చేశాడు. ఆ తర్వాత కస్టమర్లకు దొరకకుండా తప్పించుకు తిరగటం మొదలుపెట్టాడు. అనేక మంది పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం, ఆఫీసులో అందుబాటులో ఉండకపోవడంతో గత నెల పెద్దఎత్తున కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. దాంతో స్పందించిన బాలస్వామి కాటన్ ధర పెరగడంతో కొంత ఇబ్బందులు వచ్చాయని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికాడు. కానీ నెలలు గడుస్తున్నా అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పదిహేను రోజుల కిందట బాధితులు మేడిపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదిహేను రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని బాలస్వామి పోలీసుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం బోడుప్పల్‌లోని ఏదులా కంపెనీ కార్యాలయం ఎదుట బాధితులు పెద్దసంఖ్యలో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావ్, మేడిపల్లి డీఐ ప్రవీణ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అతనిపై ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని, నాలుగైదు రోజుల్లో అరెస్టు చేస్తామని, అవసరమైతే పీడీయాక్ట్ ప్రయోగించి సదరు కంపెనీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తామని చెప్పారు.