Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాగితాల్లోనే జీతాల పెరుగుదల
- అమలుకు నోచని కవిత, కేటీఆర్ హామీలు
- పట్టించుకోని కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు
- తీవ్ర కష్టాల్లో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
కండలు కరిగించి సంస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కడుపునిండా బువ్వ లేదు.. కంటి నిండా నిద్ర ఉండటం లేదు. అయినా కష్టనష్టాలకోర్చి పనిచేస్తున్నారు. ఇంతచేసినా కనీసం వారి ఉద్యోగానికి గ్యారెంటీ.. బతుక్కు భరోసా లేకుండా పోయింది. పనికి తగిన వేతనాలు లభించక దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి.
సింగరేణిలో భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులు, ఎలక్ట్రికల్, సిఎస్పి, ప్లాంటేషన్, పారిశుధ్యం, ఆఫీసు సిబ్బంది, డ్రైవర్లుగా దాదాపు 35 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వీరి జీతభత్యాలు పెంచుతామని కొత్తగూడెంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గోదావరిఖనిలో మంత్రి కేటీఆర్ బహిరంగంగా ప్రకటించి ఏండ్లు గడిచిపోయాయి. పెంచుతున్నట్టు ప్రకటించినా ఆచరణలో నేటికీ రూపాయి కూడా పెరగలేదు.
కాంట్రాక్టు కార్మిక వ్యవస్థ బొగ్గు గనుల్లో చట్టరీత్యా నేరం. చట్టాలను తుంగలో తొక్కి ఆడా, మగ తేడా లేకుండా అందరితో పనులు చేయిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతభత్యాల చెల్లింపు, సౌకర్యాల అమలుపై స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు నేటికీ లేవు. దీనికి తోడు సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేయడం లేదని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2013 సంవత్సరం నుంచి కోల్ ఇండియా గనుల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారు. జెబిసిసిఐ పదో వేతన ఒప్పందంలో కాంట్రాక్టు కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం కోల్ ఇండియాలో కాంట్రాక్టు కార్మికుల వేతనం రోజుకు రూ.985 చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ నెలలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. నైపుణ్యం లేని కార్మికులకు రూ.19,500, నైపుణ్యం కలిగిన వారికి రూ.37వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై కాంట్రాక్టర్ల, పెట్టుబడిదారుల ఒత్తిడి నేపథ్యంలో నేటికీ జీవో రూపంలో విడుదల చేయలేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు 30శాతం వేతనాలు పెంచుతూ జీవో విడుదల చేశారు. జీవో 16 ప్రకారం నైపుణ్యంలేని కార్మికుడికి 15,600 నెల రోజులకు చెల్లించాలని పేర్కొన్నారు. ఇవేవీ సింగరేణిలో అమలుకు నోచుకోలేదు.
ఒక్కరూపాయి పెరగలే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నేటివరకు ఒక్క రూపాయి కూడా జీతం పెరగలేదు. కోల్ ఇండియాలో చెల్లిస్తున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదు. దీనిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రిని, కార్మికశాఖ అదికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగమూ జరగలేదని కార్మికులు వాపోతున్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన శాసనసభ్యులే అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తున్నామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించడం సిగ్గుచేటని కార్మిక వర్గం, కార్మిక కుటుంబాలు విమర్శిస్తున్నాయి. కాంట్రాక్టు కార్మికులు అనారోగ్యానికి గురైనా, ప్రమాదంలో గాయపడినా బాధితుడికి మాత్రమే సింగరేణి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కార్మికుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి చికిత్సనూ యాజమాన్యం అందించడం లేదు. కార్మికులు మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ హాస్పిటల్, ప్రయివేట్ హాస్పిటల్ వెళ్తే సొంతంగా లక్షలాది రూపాయల ఖర్చులు భరించుకోవాల్సి వస్తున్నది. ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణం కోల్పోతున్నా నష్టపరిహారం చెల్లింపుపై స్పష్టమైన విధానం లేదు. కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం వల్ల మెరుగైన ఆరోగ్య చికిత్స లభించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు లీవు సౌకర్యం కూడా పొందలేకపోతున్నామని బాధపడుతున్నారు.
వలస కార్మికులు
సింగరేణి వ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అంతర్రాష్ట్ర వలస చట్టాలను కాంట్రాక్టర్లు పాటించడం లేదు. చట్టం ప్రకారం వీరికి కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదు. గత సంవత్సరం ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రమాదాలు జరిగి 12మంది కాంట్రాక్టు కార్మికులు చనిపోయారు. వారి కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారమూ చెల్లించలేదు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనులు చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులపై యాజమాన్యానిది చిన్నచూపే. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కార బాధ్యత కోల్బెల్ట్ ఎమ్మెల్యేలదే, కాగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
హైపవర్ కమిటీ వేతనాలపై పట్టింపు లేదు
సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులే లేరని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది. కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. రక్షణ పర్యవేక్షణ కమిటీల్లో కాంట్రాక్టు కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. జీతాలు, సౌకర్యాలు కల్పించే బాధ్యత కోల్బెల్ట్ ఎమ్మెల్యేలదే. యాజమాన్యం, ప్రభుత్వం దిగిరాకుంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు తప్పవు.
- పి.మధు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి
కోల్ ఇండియా జీతాలు ఇప్పించండి
సింగరేణి కంపెనీ నుంచి జీవో ప్రకారం జీతాలను కాంట్రాక్టర్ తీసుకుంటున్నాడు. మాకు దండి కొట్టి తక్కువ ఇస్తున్నాడు. ఉప్పు, పప్పు, గ్యాస్, కూరగాయల ధరలు బాగా పెరిగినాయి. బతుకుడు కష్టంగా ఉంది. సింగరేణి కొలువు చేసేటోల్ల లెక్క పని చేస్తున్నం.. మాకు నెలకు 15వేల జీతం రావడం లేదు. కోల్ ఇండియాలో హైపవర్ వేతనాలు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా అమలు చేస్తే మేము కడుపునిండా బువ్వ తింటాం, మా పొల్లగాళ్లను చదివించుకుంటాం. లీడర్లు జర దయ చూడుండ్రి.
అయిలవేణి భూమయ్య
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు