Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలుగు పోస్తున్న చెరువులు
- కనువిందు చేస్తున్న జలపాతాలు
- తెరుచుకున్న ప్రాజెక్టుల గేట్లు
- లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు
- గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం
- సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ- విలేకరులు
మూడ్రోజులుగా ముసుగేసిన ముసురు వాన ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. రాత్రి సమయానికి భారీ వర్షం పడుతోంది. ఈ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు, ఇండ్ల చుట్టూ నీరు చేరింది. రోడ్లు, వంతెనలు కోతకు గురయ్యాయి. ఇండ్లు కూలాయి. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున వరద నీరు చేరడంతో అలుగు పోస్తున్నాయి. జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం పొంగిపొర్లుతోంది. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల అక్కడి నుంచి వరద పరవళ్లు తొక్కుతోంది. నిర్మల్ జిల్లా కడెం నారాయణరెడ్డి జలాశయంలోకి భారీగా వరద చేరడంతో అధికారులు 9 గేట్లు ఎత్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనూ ధారాళంగా వాన పడింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వనపర్తిలో 60 మి||మీ||ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మి||మీ||లు, నాగర్‌కర్నూల్‌లో 15 మి||మీ||ల వర్షపాతం నమోదైంది. జూరాలకు 1,725 క్యూసెక్కుల నీరు చేరుతుంటే బయటకు 1088 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. జూరాల పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలుంటే.. ప్రస్తుతం 3.390 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 215 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉంది.
నిజామాబాద్ జిల్లా నవీపేట్లో 20.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో 968 చెరువులకుగాను 280 చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. 63 చెరువులు అలుగుపారాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏర్గట్ల-మెట్పల్లి రోడ్డులో తీగలవాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. గుమ్మిర్యాల్ గ్రామంలో మూడు జిల్లాలు కలిపే వంతెన రోడ్డు కోతకు గురైంది. ఐదు ట్రాన్స్ఫార్మర్లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. మాక్లూర్ మండలంలోని వెంకటాపూర్, బోధన్ మండలంలోని కొప్పర్గలో ఇండ్లు కూలాయి. ఇందల్వాయి మండలంలోని చిన్నవాగు రహదారి తెగింది. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ తిరుమల కాలనీలోని ఇండ్లల్లోకి వర్షపునీరు చేరింది. సాలూర వద్ద మంజీరా నది ప్రవాహం పెరిగింది. నవీపేట్, కమ్మర్పల్లి మండలంలోని అల్జాపూర్లో వరి పొలాలన్నీ నీట మునిగాయి.
రోడ్లపై విరిగి పడిన చెట్లు
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి-చేవెళ్ల రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. 8 విద్యుత్ స్తంభాలపై చెట్లు పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. షాబాద్ మండల పరిధిలోని మీరాపూర్, బొబ్బిలిగామ, తిర్మలాపూర్, షాబాద్, నాగర్‌గూడ ఈసీవాగు బ్రిడ్జిపై రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. వికారాబాద్ జిల్లా ఎర్రవల్లి గేటు వద్ద భారీ చెట్టు పడింది. మర్పల్లి మండలంలోని షాపూర్‌తండా, కల్కోడ గ్రామంలో ఇండ్లు కూలాయి.
నల్లగొండ జిల్లా కంచనపల్లి గ్రామంలో ఇంట్లో నిద్రస్తున్న వారిపై గోడ కూలింది. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అన్నెపర్తి గ్రామంలో గొర్రెలపై గోడ కూలడంతో పది గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై గోడ కూలింది. వెంటనే మట్టిపెళ్లలను తొలగించడంతో ప్రమాదం తప్పింది.
పూర్తిగా నిండిన వైరా రిజర్వాయర్
ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా తల్లాడలో మంగాపురం - గొల్లగూడెం గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.1 అడుగులు కాగా నిండింది. మధిర మండలం మాటూరు నుంచి మర్లపాడు మార్గ మధ్యలో నిర్మిస్తున్న తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పరిశీలించారు. కూసుమంచి మండలం నర్సింహులగూడెంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలీసులు రోడ్డుపై బారీకేడ్లు ఏర్పాటు చేశారు. చింతకాని మండలం మునగాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా అధికారులు పరిశీలించారు.
రోడ్డుపై బురదలో నాట్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గొల్లగూడెంలోని వర్షానికి రోడ్డు బురదమయంగా మారింది. సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు ఆధ్వర్యంలో నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లిక్కి బాలరాజు మాట్లాడుతూ.. చిన్న వర్షం వస్తే గొల్లగూడెం అంతర్గత రోడ్లు చెరువులను తలపిస్తూ మురికి కూపాలుగా మారాయన్నారు. నడవడానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ములకలపల్లి మండలం వేముకుంట గ్రామం ముర్రేడు వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం చౌరస్తా, కరీంనగర్ రోడు ్డపై వాన నీరు నిలిచింది. వర్షానికి దుకాణాలు తెరవలేదు. ధర్మపురి ప్రధాన రహదారిపై అనంతారంలో లెవల్ వంతెన వద్ద వరద నీటి ప్రవాహాన్ని కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, ఆర్డీఓ మాధురి, అధికారులు పరిశీలించారు.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలోకి 1343 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. రిజర్వాయర్‌లో 24.034టీఎంసీలగాను 9.397టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 232క్యూసెక్కుల అవుట్‌ఫ్లో వెళ్తోంది.
సింగరేణి గనుల్లోకి వరద నీరు
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. గనుల్లోకి భారీగా వరదనీరు చేరడంతో బొగ్గు తవ్వకాలు నిలిపివేశారు. రామగుండం రీజియన్ పరిధిలోని 1, 2, 3, 5ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు గనుల్లో ఉత్తత్తి నిలిచిపోయింది. 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. లక్షా 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా సింగరేణి అధికారులు అంచనా వేశారు. 11 మండలాల్లో భారీ వర్షం కురిసింది. జిల్లాలో చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి బ్యారేజి ఇన్‌ప్లో1,15,860 క్యూ సెక్కులుగా ఉండగా, ఔట్‌ప్లో 1,41,550 క్యూసెక్కులుంది. రామగుండంలో సహాయక చర్యలకు కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. అవసరమైన వారు ఫోన్ నెం. 96036 66444 ద్వారా 24 గంటలు సంప్రదించవచ్చని నగర మేయర్, కమిషనర్ తెలిపారు. ధర్మారం, కొత్తూరు, కమ్మర్ఖాన్పేట్ గ్రామాలలో రోడ్లకు అడ్డంగా చెట్లు విరిగిపడ్డాయి.
నీట మునిగిన కాలనీలు
రాజన్న సిరిసిల్ల జిల్లా 13 మండలాల్లో సాధారణానికి మించి అధికంగా వర్షం పడింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి సమీపంలో ఉన్న బుడగజంగాల కాలనీ పూర్తిగా నీట మునిగింది. అధికారులు పరిశీలించి బాధితులను వేరే ప్రాంతానికి తరలించి భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట వద్ద నక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోనరావుపేట మండలంలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని ధర్మారంలో పరగడ్డ ఒర్రే ప్రవాహానికి శ్రీరాములపల్లె నుండి రాకపోకలు నిలిచాయి. ఓ కారు ఒర్రెలో దిగబడింది. ఓర్రెలో ఉన్న కరెంటు స్తంభానికి ఎర్తింగ్ రావడంతో ప్రమాదంలో పడిన ముగ్గురు పిల్లలను ప్రాణాపాయం నుంచి తప్పించినట్టు సర్పంచ్ గున్నాల అరుణ తెలిపారు. మామిడిపెళ్లి వద్ద మూలవాగు వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. పత్తి, వరి పైర్లు నీటమునిగాయి.