Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా రైతుకు సంఘీభావం తెలిపిన వామపక్షాలు
- క్షీణించిన రాధమ్మ ఆరోగ్యం
నవతెలంగాణ -నల్లగొండ
తన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని, తనని, తన కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా రైతు రాధమ్మ చేస్తున్న దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడ గ్రామానికి చెందిన గోల్కొండ రాధమ్మకు చెందిన 20 గుంటల భూమిని శివన్నగూడ గ్రామానికి చెందిన చిట్యాల స్తంబారెడ్డి ధరణి పోర్టల్‌లోని లొసుగులను ఆసరాగా చేసుకొని మరొకరి పేరుపై పట్టా చేశాడు. రాధమ్మను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, సభ్యులను హతమారుస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో రాధమ్మ తనకు న్యాయం చేయాలని ఐదు రోజులుగా మర్రిగూడ మండల కేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయం ఎదుట భారీగా దీక్షకు దిగింది. భారీగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నది. కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. న్యాయం జరిగే వరకు తన దీక్షను కొనసాగిస్తానని రాధమ్మ తెలిపారు.
అనారోగ్యం బారిన పడిన రాధమ్మ
ఐదు రోజుల నుంచి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న రాధమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. సమయానికి తిండి లేక, వర్షానికి తడుస్తూ తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఐదో రోజు ఉదయం దీక్షలో కూర్చున్న సమయం నుంచి చలితో వణుకుతూ కూర్చున్న చోటనే కుప్ప కూలింది. వెంటనే మర్రిగూడకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్‌కు సమాచారం అందించగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వర్షానికి తడవటం, సమయానికి తినకపోవటం, టెన్షన్స్ వల్ల ఆరోగ్యం దెబ్బ తిన్నదని, ఇలాగే దీక్ష కొనసాగిస్తే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని తెలిపారు. ఓ మహిళ ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ఏ ఒక్క అధికారి స్పందించకపోవటం అందరి మనసును కలచివేస్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించకముందే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని, ఎటువంటి ఇబ్బంది జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. రాధమ్మకు న్యాయం జరగని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఐ(ఎం), సీపీఐ మండల కార్యదర్శులు ఏర్పుల యాదయ్య, ఈదుల బిక్షం రెడ్డి హెచ్చరించారు.