Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజుల పాటు పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
- ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం
- మంచిర్యాల జిల్లా కొల్లూరులో 18.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ, కుండపోత వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి. ఆరెంజ్ హెచ్చరిక జాబితాలో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(రూరల్), వరంగల్(అర్బన్), జనగాం జిల్లాలున్నాయి. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. ఉత్తర ద్వీపకల్ప భారతదేశమంతటా సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన సంచాలకులు కె.నాగరత్న తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది.
ఎత్తుకు వెళ్లేకొద్దీ నైరుతి దిశకు వంపు తిరిగి ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 750కిపైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొల్లూరులో అత్యధికంగా 18.45 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో ఏడుచోట్ల అత్యంత భారీ వర్షం పడింది. 46 ప్రాంతాల్లో భారీ, 366 ప్రాంతాల్లో మోస్తరు, మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. గోదావరి నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.